
పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ కేజీబీవీలో ఘటన
నార్నూర్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం అల్పాహారంగా అందించిన పులిహోరలో పురుగులు రావడంతో విద్యార్థినులంతా తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో పవార్ అనిత అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే వారు వినిపించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఐటీడీఏ పీవో, డీఈవో ఖుష్బుగుప్తా ఫోన్‌లో వారితో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమీపంలోని వేరే వసతి గృహం నుంచి సరుకులు తెచ్చి వెంటనే వండి విద్యార్థినులకు పెట్టాలని ఆమె ఎంఈవోను ఆదేశించారు.
అయితే రెండోసారి ఉప్మా అందించగా.. అందులో కూడా పురుగులు రావడంతో విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్డడం లేదని, రోజూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు తెలిపారు. సమస్యను ఎస్‌వో హిమబిందు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పాఠశాలను సందర్శించిన సబ్‌కలెక్టర్
కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మార్మట్ కేజీబీవీని సందర్శించారు. వంట గది, సరుకులను పరిశీలించారు. నాసిరకం కూరగాయలతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఎస్‌వో హిమబిందుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్తినులు శాంతించారు.
విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం, జైభారత్, రాజ్‌గోండ్ సేవా సమితి, తుడుందెబ్బ, బీజేపీ నాయకులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సమయంలో జీసీడీవో ఉదయశ్రీ జోక్యం చేసుకుని వారిని లోపలికి ఎందుకు వచ్చారని అనడంతో వారంతా ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.