స్వతంత్రులపై ఫోకస్
గెలిచిన ఇండిపెండెట్లపై ప్రధాన పార్టీల దృష్టి
అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చిన బీఆర్‌ఎస్
మేజర్ జీపీల్లో మాత్రం ‘హస్తం’, ‘గులాబీ’ పార్టీలకు ప్రతికూలం
సాక్షి,ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట మేజర్ పంచాయతీల్లో ఫలితాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ స్వతంత్రులు విజేతలుగా గెలిచారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు.
‘హస్తం’కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీనిచ్చింది. నువ్వా.. నేనా అన్నట్టుగా ఫలితాలు నిలిచాయి. ఈ రెండు పార్టీల తర్వాత స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలుపొందడం గమనార్హం. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే స్వతంత్రులు ఎక్కువగా గెలిచారు. వారు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
రెండో విడత ఏకగ్రీవాలు ఇలా..
రెండో విడత ఎన్నికలు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 6, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరగనున్నాయి. ఇక్కడ 17 జీపీల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఉండగా, ఏడుగురు స్వతంత్రులు ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్‌రూరల్, బేల నుంచి ఏకగ్రీవమైన సర్పంచులు వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే విషయంలో ఇప్పుడే నిర్ణయం వెలువర్చడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా అటువైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరపతితో ఆయా పార్టీల వైపు మొగ్గుచూపుతారా.. లేదా అనేది కూడా చూడాల్సిందే. మొత్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.
మొదటి విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపర్చిన, స్వతంత్రులుగా గెలిచిన
సర్పంచ్‌ల వివరాలు
మొత్తం పంచాయతీలు 166
కాంగ్రెస్ 61
బీఆర్‌ఎస్ 59
బీజేపీ 10
స్వతంత్రులు 36
స్వతంత్రులపై ఫోకస్


