పచ్చదనం కనుమరుగు
రాజరాజేశ్వరనగర్‌లో నరికివేసిన పచ్చని చెట్లు
కై లాస్‌నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరిట ఏట కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మరోవైపు ఏపుగా పెరిగిన ఆ చెట్లను విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా నరికివేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలు తొలగించాలంటే ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్ విధిగా అటవీశాఖ అనుమతి తీసకోవాలి. అయితే పట్టణంలోని రాజరాజేశ్వరనగర్‌లో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంబంధిత ఏఈ అత్యుత్సాహం ప్రదర్శించారు. అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అవెన్యూ ప్లాంటేషన్‌లో పదుల సంఖ్యలో ఉన్న వృక్షాలను కట్టర్ సాయంతో మొదళ్లకు నరికివేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉన్న పచ్చదనం కనుమరుగైంది. పర్యావరణ పరిరక్షణ నినాదం ప్రశ్నార్థమవుతోంది.
అనుమతి తీసుకోలేదు..
చెట్ల నరికివేతకు సంబంధించి విద్యుత్‌శాఖ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. విష యం తెలియగానే టాస్క్‌ఫోర్స్ బృందం అక్కడికి వెళ్లి చెట్లను తొలగిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులపై వాల్టా చట్ట ప్రకారం కేసు నమోదు చేశాం.
– గులాబ్‌సింగ్, ఎఫ్‌ఆర్‌వో
విచారణ జరుపుతున్నాం..
33/11 కేవీ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించాం. నిబంధనల ప్రకారం కొమ్మలనే తొలగించాల్సి ఉండగా చెట్లను నరికివేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్నాం.
– జాదవ్ శేష్‌రావు, ఎస్‌ఈ


