డోంట్ కేర్!
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఉన్నతాధికారులు మందలించినా.. పనుల్లో జరిగిన లోపాలపై విచారణలు జరిగినా.. సదరు అధికారుల తీరులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా అమృత్ సరోవర్ స్కీం కింద చేపట్టిన పనులే ఇందుకు నిదర్శనం. రూ.25లక్షల విలువైన పనులను మరోసారి ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆగమేఘాలపై చేపట్టిన పనులతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్దేశమేంటంటే...
భూగర్భ జలాలు సంరక్షించడంతో పాటు వాటిని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.25 లక్షల నిధులు కేటాయించింది. వీటి ద్వారా వీటి ద్వారా పట్టణంలోని చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం చేపట్టిన పనులతో పాటు ఫొటోలతో కూడిన వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీంతో పట్టణంలోని కుమ్మరికుంట, బాలాజీనగర్ చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని బల్దియా అధికారులు నిర్ణయించారు.
పూడికతీత పనులు చేస్తున్నాం..
పట్టణంలోని రెండు చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నాం. వీటికి టెండర్లు నిర్వహించని మాట వాస్తవమే. డిపార్ట్‌మెంట్ ద్వారానే పనులు చేస్తున్నాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా చూస్తాం.
– సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్


