న్యాయం చేయకపోతే ఆత్మహత్యే..

Sircilla Market Committee EX Chairperson Allegations On TRS Leaders On Land Dispute - Sakshi

 సిరిసిల్ల ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ లింగం రాణి ఆవేదన

సాక్షి, సిరిసిల్ల: అండగా నిలవాల్సిన సొంత పార్టీ నాయకులే తన వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ లింగం రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి తక్కళ్ల సుందర్‌ తాడూరు గ్రామ శివారు సర్వే నంబర్‌ 1147లో ఎకరం 22 గుంటలు వ్యవసాయ భూమిని 1985లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. అప్పటినుంచి కాస్తులో తామే ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఆ భూమి తమదేనని టీఆర్‌ఎస్‌ నాయకుడు కుర్మ రాజయ్య తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.

తనకు రూ.70 వేలు ఇస్తేనే భూమిని వదిలేస్తానని డిమాండ్‌ చేయడంతో గతేడాది రూ.30వేలు చెల్లించానని తెలిపారు. ప్రస్తుత సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌ అన్న అనంతరెడ్డి ఆ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరికి తంగళ్లపల్లి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కూడా అండగా ఉన్నాడని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే ఇలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుంటానని ఆమె హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్‌పర్సన్‌ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మండల టీఆర్‌ఎస్‌లో చిచ్చు రేపుతుందో? లేదా టీ కప్పులో తుపానులా సద్దుమణుగుతుందోనని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గుసగసులు పెడుతున్నారు. 

చదవండి: ఆక్సిజన్‌ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్‌

కన్నీరు పెడుతున్న లింగం రాణి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top