
1998లో పాక్‌లో ఓ విమానం హైజాక్.. ఆ దేశంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్
ఆ సందర్భాన్ని తాజాగా ప్రస్తావిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ పంచుకున్న ఓ నెటిజన్
దాన్ని విమాన హైజాక్ బెదిరింపుగా పొరబడ్డ శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఏఐ ఆధారిత టూల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేసిన వైనం
పూర్వాపరాలు చూసుకోకుండానే పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు
శంషాబాద్: అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట పాకిస్తాన్‌లో ఓ విమాన హైజాక్ ఘటన జరిగితే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు మాత్రం తెగ కంగారు పడిపోయి ఇప్పుడు కేసు పెట్టారు!! పోలీసులు కూడా పూర్వాపరాలు తెలుసుకోకుండానే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసేశారు!! ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. 1998 మే 28న జరిగిన పాక్ విమాన హైజాక్ ఉదంతం, హైజాకర్ల అరెస్టును ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ఈ నెల 14న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అయితే ఆ పోస్ట్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అనే పేరు పలుమార్లు రావడంతోపాటు హైజాకర్లు, ఢిల్లీ తదితర పదాలు ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీఓసీ) ఉపయోగిస్తున్న ఓ ఏఐ ఆధారిత టూల్ పొరబడింది. ‘ఎక్స్’ వేదికగా ‘బెదిరింపు సందేశం’ వచ్చిదంటూ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఏసీఓసీకి చెందిన రాకేశ్ కుమార్ శర్మ అనే సెక్యూరిటీ, విజిలెన్స్ అధికారి.. పూర్వాపరాలు చూసుకోకుండానే అదే రోజు ఆర్‌జీఐఏ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ‘ఎక్స్’లో ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని ఆర్‌జీఐఏ పోలీసులు పేర్కొనడం గమనార్హం. నిజాంల కాలంలో మన భాగ్యనగరం పేరును అన్ని రకాల సమాచార సందేశాల్లో హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ (డెక్కన్) అని సంబోధించేవారు. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న మరో హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ (సింధ్)గా పిలుస్తున్నారు.
నాడు జరిగింది ఇదీ..
బలోచ్ హైజాకర్లు పాక్ విమానాన్ని ఢిల్లీ మళ్లించాలని డిమాండ్ చేయగా అంతదూరం వెళ్లేందుకు ఇంధనం సరిపోదంటూ హైజాకర్లను విమాన కెప్టెన్ ఉజెయిర్ ఖాన్ బురిడీ కొట్టించాడు. కావాలంటే తొలుత గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి ఇంధనం నింపుకున్నాక ఢిల్లీ తీసుకెళ్తానంటూ వారిని నమ్మించాడు. హైజాక్ ఉదంతాన్ని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు కోడ్ భాషలో పంపాడు. వారు సైతం భారత అధికారులుగా హైజాకర్లను భ్రమింపజేస్తూ భుజ్‌లో విమాన ల్యాండింగ్‌కు అనుమతిస్తున్నట్లు రిప్లై ఇచ్చారు.
చివరకు విమానం అక్కడి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగా తాము భారత భూభాగంలోకి ప్రవేశించామని హైజాకర్లు నమ్మారు. ఆ వెంటనే పాక్ కమాండోలు విమానంలోకి చొరబడి హైజాకర్లను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. ఆ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఆ ఉదంతం జరిగిన 17 ఏళ్లకు.. అంటే 2015 మే 28న హైజాకర్లను పాక్ ప్రభుత్వం ఉరితీసింది.