
18 కొత్త మునిసిపాలిటీలు, 5 పాత కార్పొరేషన్లు, 7 పాత మునిసిపాలిటీలు
జూన్ 21లోపు ప్రక్రియ పూర్తి కావాలంటూ ఉత్తర్వులు
ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి మునిసిపాలిటీలకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మునిసిపల్ వార్డుల విభజనకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో 18 కొత్త మునిసిపాలిటీలు కాగా, మిగతావి పాత కార్పొ రేషన్లు, మునిసిపాలిటీలు. మునిసిపల్ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో వార్డుల విభజన ప్రక్రియ మంగళవారం నుంచి జూన్ 21 వరకు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది.ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఉన్న మునిసిపాలిటీల్లో కొత్త ప్రాంతాల కలయికతోపాటు, కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. కాగా ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో ఉన్న 13 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పునర్విభజన జోలికి వెళ్లలేదు. ఓఆర్‌ఆర్ లోపలి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను కలిపి కొత్తగా మూడు కార్పొరేషన్లుగా మార్చాలని యోచిస్తున్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్లలేదు.

21లోపు వార్డుల విభజన: 18 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లోనే చ ట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా ముని సిపాలిటీలకు వార్డుల సంఖ్యను పురపాలక శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉన్న ఐదు కార్పొరేషన్లు, ఏడు మునిసిపాలిటీల్లోనూ వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలి.