
పొదుపు మహిళలకు పంపిణీ
జిల్లాకు రానున్న 2,39,950 చీరలు
నిల్వ చేసేందుకు గోదాముల గుర్తింపు మహిళలకు అందిస్తాం
జగిత్యాల: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఎన్ని సంఘాలున్నాయి..? ఎంతమంది మహిళ సభ్యులు ఉన్నారు..? అనేది లెక్కలు తీశారు. జిల్లాకు మొత్తం 2,39,950 చీరలు రానున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరల పేరిట పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా బతుకమ్మ పండగకు చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.
బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యేనాటికి మహిళాసంఘాల సభ్యులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో గోదాములను గుర్తించి నియోజకవర్గాలుగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రేవంతన్న కానుకగా ప్రతి సంఘం సభ్యులకు చీరెలు అందించనున్నారు. మరో రెండుమూడు రోజుల్లో చీరలు జిల్లాకు రానున్నట్లు డీఆర్డీఏ శాఖ అధికారులు తెలిపారు. మెప్మా సిబ్బందికి పంపిణీ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని మూడు నియోజకవరాల్లో గోదాం పాయింట్లను ఏర్పాటు చేశారు.
మహిళలకు అందిస్తాం
ప్రతి సంఘం సభ్యురాలికి బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు అందించనున్నాం. జిల్లాకు 2,39,950 చీరలు రానున్నాయి. నిల్వ చేసేందుకు గోదాం పాయింట్లు గుర్తించాం. త్వరలోనే మహిళలకు అందించేలా చర్యలు తీసుకుంటాం.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ