టీకాతోనే పూర్తి రక్షణ

Sakshi Special Interview With Dr Srinivasa Rao

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ 

వేసుకున్నాక నొప్పి, ఎర్రబారడం జరుగుతుందంతే 

అంతకుమించి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు 

యాంటీబాడీలు రాకుంటే రెండోసారి వేసుకోవచ్చు 

వ్యాక్సినేషన్‌ కోసం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు  

సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌పై సమాచారం లేదు 

1030 ప్రభుత్వ,170 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ 

1500 కేంద్రాల ఏర్పాటు...

టీకాలు వేసేవారు 10 వేలు 

జూన్‌ నాటికి మొదటి ఫేజ్‌ ప్రక్రియ పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌తోనే కరోనాపై పోరాటంలో పూర్తిస్థాయి విజయం సాధించగలమని, టీకాలు వేసుకుంటేనే మనకు ఈ మహమ్మారి నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. టీకాలు పూర్తిగా సురక్షితం కాబట్టి... ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా అందరూ తీసుకోవాలని కోరారు. మొదటి రోజు శనివారం 139 కేంద్రాల్లో టీకాలు వేస్తారు. తొలిరోజు టీకా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కొన్ని సెంటర్లలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా టీకాల కార్యక్రమం, సన్నాహాలు, దానిపై లబ్దిదారులకు ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

సాక్షి: వ్యాక్సిన్‌ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి?  
డాక్టర్‌ శ్రీనివాసరావు: టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నాం. తొలి రోజు 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యాక్సినేషన్‌ సెల్‌ ఏర్పాటు చేశాం.  

తొలిరోజు తర్వాత ఎన్నిచోట్ల వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తారు?  
16న తొలిరోజు కొన్నిచోట్ల టీకా ప్రారంభం కానుంది. తరువాత ఆదివారం సెలవు. 18 నుంచి పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ చేపడతాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ఒక సెంటర్, మధ్యస్థాయి ఆసుపత్రుల్లో రెండు కేంద్రాలు, గాంధీ వంటి పెద్దాసుపత్రులు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 4 చొప్పున వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 2 వారాల్లో వైద్య సిబ్బంది అందరికీ టీకాలు వేయడాన్ని పూర్తి చేస్తాం. తర్వాత మరో రెండు వారాల్లో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేస్తాం. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలను కేంద్రానికి తెలియజేశాం. వారు సరిదిద్దుతారు.  

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చినట్లు సమాచారముందా?  
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ యూరోపియన్‌ దేశాల్లో వేస్తున్నారు. అక్కడ ఎలాంటి సీరియస్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని రిపోర్టులు వస్తున్నాయి. ఆ వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్‌ వేసిన దగ్గర నొప్పి,ఎర్రబారడం మాత్రమే జరుగుతుంది. ఆ వ్యాక్సిన్‌ సురక్షితమని నిర్ధారణ అయింది. కరోనా టీకా ఏదైనా కచి్చతంగా సురక్షితమే. అయితే జ్వరం, నొప్పులు, తలనొప్పి వంటి కొన్ని చిన్నచిన్న సైడ్‌ఎఫెక్ట్స్‌ రావొచ్చు. అది ఏ వ్యాక్సిన్‌లోనైనా సహజమే. 

ప్రజలకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?  
మొదటి దశలో వైద్య సిబ్బందికి ముందుగా వేస్తారు. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేస్తారు. అలా 75 లక్షల మందికి మొదటి విడతలో జూన్‌ నాటికి టీకా కార్యక్రమం పూర్తవుతుంది. సాధారణ ప్రజలకు ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందో కేంద్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.  

వ్యాక్సిన్‌ వేసుకున్న ఎన్ని రోజులకు రక్షణ లభిస్తుంది?  
మొదటి డోసు నుంచి పరిశీలిస్తే... వ్యాక్సిన్‌ వేసుకున్నాక సరిగ్గా 42 రోజులకు రక్షణ వస్తుంది.  
 
యాంటీబాడీలు తయారు కాకుంటే ఏంచేయాలి?  
టీకా వేసుకున్న వాళ్లల్లో అందరికీ యాంటీబాడీలు తయారవుతాయి. ఒకవేళ యాంటీబాడీలు తయారుకాని వాళ్లు మళ్లీ టీకా వేసుకోవచ్చు. 

చిన్న పిల్లలకు ఎందుకు వేయడంలేదు? 
18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేయడం లేదు. ఎందుకంటే ఆ వయస్సు వారిపై ఎలాంటి ట్రయల్స్‌ జరగలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top