‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం | TSRTC MD Sajjanar Will Consider The Demands Of The Rented Busses, See Details Inside - Sakshi
Sakshi News home page

TSRTC MD Sajjanar: ‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం

Published Fri, Jan 5 2024 3:39 AM | Last Updated on Fri, Jan 5 2024 10:50 AM

Sajjanar will consider the demands of the rented busses  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వారం రోజుల్లో నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక రద్దీ విపరీతంగా పెరగటంతో ఐదు రకాల సమస్యలు ఎదురవుతు న్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కొద్దిరోజులుగా అద్దె బస్సు యజ మానులు కోరుతున్నారు.

అయినా ఆర్టీసీ స్పందించటం లేదని ఆరో పిస్తూ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గురువారం ఉదయం అద్దె బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే ఎండీతో మాట్లాడి, సంఘం ప్రతినిధులతో చర్చించాలని స్పష్టం చేశారు.

చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
మంత్రి ఆదేశాల మేరకు బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి సంఘం ప్రతినిధులతో చర్చించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువై డీజిల్‌ వినియోగం పెరిగినందున కేఎంపీల్‌ను జిల్లా సర్వీసుల్లో 4.50కి, సిటీలో 4కు మార్చాలని, టైర్లు ఎక్కువగా అరుగుతున్నందున ఆర్టీసీకి అందించే బల్క్‌ ధరలకే తమకూ కొత్త టైర్లు కేటాయించాలని, ఓవర్‌ లోడింగ్‌తో నిర్వహణ ఖర్చులు పెరిగినందున అద్దె మొత్తాన్ని రూ.3 చొప్పున పెంచాలని వారు కోరారు. దీనిపై కమిటీ వేసి అమలు సాధ్యాసాధ్యా లపై నిర్ణయం తీసుకుంటామని ఎండీ సజ్జనార్‌ వారికి హామీ ఇచ్చారు.

ఈ మేరకు సమ్మె ప్రతిపాదనను సంఘం ప్రతినిధులు విరమించుకున్నట్టు సమావేశానంతరం ఎండీ ప్రకటించారు. యధావిధిగా బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్, అధికారులు మైపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా పలువురు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement