‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర | rs praveen kumar comments on SIR | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర.

Jun 16 2026 10:00 PM | Updated on Jun 16 2026 10:00 PM

rs praveen kumar comments on SIR

సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని ఇతర పార్టీ నాయకులను భయపెట్టి,అక్రమంగా కేసులు బనాయించి,అన్యాయంగా స్థానిక ప్రాంతీయ పార్టీలను అధికారం నుండి తొలగించే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ఈ రోజు నల్గొండ జిల్లాలోని దేవరకొండ,నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ఎస్ఐఆర్ పేరిట ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ను అడ్డుపెట్టుకొని దేశ వ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో 86 లక్షల ఓట్లు తొలగించారని, బీహార్‌లో 46 లక్షల ఓట్లు తొలగించారని, ఉత్తరప్రదేశ్ లో సుమారు 2 కోట్లు మొత్తంగా ఇప్పటివరకు 6 కోట్ల  ఓట్లు తొలగించారన్నారు. అస్సాంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉన్నదని అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించలేదని విమర్శించారు.

నిజంగా దేశ ఎన్నికల కమీషన్ పారదర్శకంగా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోయేది కాదన్నారు. తెలంగాణలో కూడా బిజేపి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నాయని, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి,ఆ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసే ఉన్నాయని, అందుకే పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను, తొమ్మిది రోజులపాటు రేవంత్ రెడ్డి కాపాడారని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీజేపీకి సహాయం చేయడానికి, రాజ్యసభ ఎంపిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేస్తే,గాంధీ భవన్ నుండి లీకులు ఇచ్చి, ఆమెకు వెన్నుపోటు పొడిచి,మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు లీకులు ఇచ్చి ఆమె నామినేషన్ రద్దు చేయించారని పేర్కొన్నారు.

అందుకే కాంగ్రెస్, బిజేపి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వివరించారు. 2018లో చంద్రబాబు సేవామిత్ర మొబైల్ యాప్ ద్వారా వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తే, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు.

అదే విధంగా తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి యాప్ తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. బీఎల్ఏలు అయ్యప్ప దీక్ష, భీమ్ దీక్ష, హనుమాన్ దీక్ష చేపట్టినట్లే, బిఆర్ఎస్  కార్యకర్తలు,బిఎల్ఏలు ఎస్ఐఆర్ దీక్ష చేపట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీఎల్ఓలు సర్వేలో భాగంగా ఇంటికి వస్తే ఖచ్చింతంగా నూతన ఓటు నమోదు కోసం ఫారం 6, తొలగించాలంటే ఫారం 7, అభ్యంతరాలు సవరణల కోసం ఫారం 8 నింపి ఇవ్వాలన్నారు. ఇసిఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా బూత్ పరిధిలో ఉన్న ఇంటింటికి తిరిగి అర్హులైన అందరి ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని,తర్వాత బిఎల్ఓ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇటీవల ఏం చేసైనా, కిందపడి, మీద పడి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం వెనుక , ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నందునే మాట్లాడారని,అందుకే బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి బిఎల్ఏలు అవసరం లేదని,ప్రభుత్వ ఉద్యోగులను,బిఎల్ఓలను వారు బిఎల్ఏలుగా పని చేసే విధంగా వారిని బెదిరించి పని చేయిస్తారన్నారు. అందుకే బిఎల్ఓలను,బిఎల్ఏలు వెంటవెంటనే అనుసరించి దొంగ ఓట్లు నమోదు కాకుండా,అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలని వివరించారు

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్,నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి లింగయ్య యాదవ్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement