‘రింగు’ భూసేకరణలో వందల ఎకరాలు మిస్‌! | Revenue authorities have forgotten 460 acres in land acquisition required for RRR | Sakshi
Sakshi News home page

‘రింగు’ భూసేకరణలో వందల ఎకరాలు మిస్‌!

Jun 30 2024 4:55 AM | Updated on Jun 30 2024 5:28 AM

Revenue authorities have forgotten 460 acres in land acquisition required for RRR

అలైన్‌మెంట్‌ పరిధిలోనే ఉన్నా వివరాల నమోదు మరిచిన అధికారులు

భూపరిహారం చెల్లింపు వేళ 460 

ఎకరాలు మిస్‌ అయినట్లు తాజాగా గుర్తింపు

వాటికి మళ్లీ భూసేకరణ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు 460 ఎకరాలను మరిచిపోయారు. అలైన్‌మెంట్‌ పరిధిలోని ఆ భూమిని భూసేకరణ జాబితాలో చేర్చకుండానే పరిహారం పంపిణీ అవార్డులు పాస్‌ చేసే కసరత్తు చేపట్టారు. విషయం తెలిసి ఇప్పుడు ఆ మరిచిపోయిన భూమిని సేకరించేందుకు హడావుడి మొదలుపెట్టారు. అందుకు అవసరమైన గెజిట్‌ నోటిఫికేషన్లను జారీ చేశారు. మిగతా భూసేకరణకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ల తంతు పూర్తి చేసిన 8 నెలల తర్వాత ఇప్పుడు ఈ భూసేకరణ గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. 

ఏం జరిగిందంటే.. 
రీజనల్‌ రింగురోడ్డులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. అలైన్‌మెంట్‌ పరిధిలోకి వచి్చన భూములు ఇక రీజినల్‌ రింగురోడ్డు కోసం ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వ అదీనంలోకి వచ్చాయంటూ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. భూపరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు గ్రామాలవారీగా అవార్డులు పాస్‌ చేసేందుకు సిద్ధమైంది. 

ఈ క్రమంలో తాజాగా భూముల వివరాలు పరిశీలిస్తుండగా అలైన్‌మెంట్‌ పరిధిలోకి వచి్చన భూముల్లో కొన్ని భూసేకరణ తుది జాబితాలోంచి మిస్‌ అయ్యాయని అధికారులు గుర్తించారు. నర్సాపూర్‌ ‘కాలా’ పరిధిలో 360 ఎకరాలు, గజ్వేల్‌ ‘కాలా’ పరిధిలో మరో 100 ఎకరాలు ఇలా గల్లంతైనట్లు తేల్చారు. అయినప్పటికీ గతేడాది భూసేకరణకు సంబంధించి రెండు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆ గెజిట్‌ నోటిఫికేషన్ల గడువు కూడా తీరిపోయింది. 

మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ల జారీ 
సేకరించాల్సిన భూములను నోటిఫై చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇందులో 3ఏ, 3డీలు కీలకమైనవి. గ్రామం పేరు, సర్వే నంబర్లు, భూమి పరిమాణం వివరాలు తెలుపుతూ మూడు రోజుల క్రితం 3ఏ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేశారు. నర్సాపూర్, గజ్వేల్‌ కాలాలకు సంబంధించి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. 

వీటిపై అభ్యంతరం ఉన్న వారు 21 రోజుల్లో తమ అభ్యంతరాలను ఆయా ‘కాలా’లకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత భూ యజనమానుల పేర్లతో 3డీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తేగానీ ఆయా గ్రామాల్లో భూసేకరణకు వీలుండదు. ఇలా ఇంకేమైనా గ్రామాల్లోనూ భూముల వివరాలు గల్లంతయ్యాయేమోనని అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement