ఎంతో కొంత కళా పోషణ ఉండాలి | Revanth Reddy at the closing ceremony of the MLA sports and cultural competitions | Sakshi
Sakshi News home page

ఎంతో కొంత కళా పోషణ ఉండాలి

Mar 30 2026 3:30 AM | Updated on Mar 30 2026 3:30 AM

Revanth Reddy at the closing ceremony of the MLA sports and cultural competitions

శాసనసభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభలో సీఎం రేవంత్‌ రెడ్డి  

విపక్ష సభ్యులు వచ్చే ఏడాదైనా క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచన

గన్‌ ఫౌండ్రీ (హైదరాబాద్‌): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 

విజేతలు వీరే.. : క్రికెట్‌లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్‌లో రాందాస్‌ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్‌ టెన్నిస్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్‌ లిఫ్టింగ్‌ 63 కేజీల విభాగంలో శంకర్‌ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్‌ రెడ్డి విజయం సాధించారు.  

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 
శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్‌ నాయక్‌ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్‌ చేయగా.. రామచంద్రనాయక్‌ తనదైన స్టెప్పులు వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement