22 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల నగలు కుమారులకు.. హైకోర్టు ఉత్తర్వులు

Requiring Separate Inheritance Certificates Not Reasonable Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టపరమైన వారసుల నుంచి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించాలని ఆదాయపు పన్ను శాఖ పట్టుబట్టడం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 22 ఏళ్ల క్రితం ఓ వ్యాపారి ఇంటి నుంచి జప్తు చేసిన ఆభరణాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 

తమ తల్లిదండ్రుల నుంచి జప్తు చేసిన అభరణాలను విడుదల చేసేలా ఐటీ శాఖను ఆదేశించాలని కోరుతూ.. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన నీలేశ్‌ కుమార్‌ జైన్‌, ముఖేశ్‌ కుమార్‌ జైన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2000లో తన తల్లిదండ్రుల ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిపిందన్నారు. పలు డాక్యుమెంట్లతో పాటు 2,462 గ్రాముల ఆభరణాలను జప్తు చేసినట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, ఐటీ విభాగం చేసిన క్లెయిమ్‌ల విషయంలో న్యాయపరమైన తగాదా నడుస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మృతిచెందారని, తాము కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ శరద్‌ సంఘి వాదనలు వినిపించారు. ఇండియన్ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని పిటిషనర్లు ఇప్పటికే వారసత్వ ధ్రువీకరణ పత్రం సమర్పించి నగదు పొందారన్నారు. దీన్ని ఐటీ అధికారులకు ఇచ్చినా.. ప్రత్యేక వారసత్వ ధ్రువీకరణ పత్రం కావాలని అడుగుతున్నారని నివేదించారు. 

ఐటీ శాఖ తరఫున సీనియర్ కౌన్సిల్‌ జేవీ ప్రసాద్‌ హాజరయ్యారు. ఆభరణాలు పిటిషనర్లకు ఇస్తే.. భవిష్యత్‌లో వాళ్ల సోదరీమణులు దావా వేసే అవకాశం ఉందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. వారు కేసు వేసినా, వాళ్ల సోదరుల మీదే వేస్తారు తప్ప ఐటీ శాఖ మీద కాదని పేర్కొంది. వారసులుగా నగలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖకు బాండ్‌ సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది ధర్మాసనం.
చదవండి: మరో కొత్త మండలం... ఇనుగుర్తి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top