కొత్తగా దక్షిణ ‘రింగ్‌’! | Sakshi
Sakshi News home page

కొత్తగా దక్షిణ ‘రింగ్‌’!

Published Sun, May 26 2024 4:49 AM

preparing to construct southern part of regional ring road completely

మొత్తం 189.4 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా నిర్మాణం

కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన మూడో అలైన్‌మెంట్‌కు మొగ్గు 

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోద ముద్ర

భారత్‌ మాల పరియోజన–2 పథకం కింద పనులు 

చేవెళ్ల–కంది రోడ్డు అనుసంధానం ఆలోచన విరమణ 

దానికి దూరంగా నిర్మాణం.. భారీగా పెరిగిన పొడవు 

నిర్మాణానికి రూ.18 వేల కోట్ల వ్యయం 

అవుతుందని అంచనా.. తుది అలైన్‌మెంట్‌ ఖరారు తర్వాత అన్ని అంశాలపై స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్‌గల్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్‌మెంటుకు.. జూన్‌లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. 

తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా..  
సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. 

కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్‌మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్‌మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్‌మెంట్‌నే ఖరారు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. 

ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. 
షాద్‌నగర్‌ నుంచి చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్‌’ అలైన్‌మెంట్‌లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. 

భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. 
రీజనల్‌ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్‌ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. 

నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్‌మెంట్‌ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. 


మొత్తం రీజనల్‌ రింగ్‌ రోడ్డు లెక్క ఇదీ.. 
ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) 
దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) 
మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) 
సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు 
భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) 
నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది)   

Advertisement
 
Advertisement
 
Advertisement