మిగతా పేపర్లు పెన్‌డ్రైవ్‌ దాటలేదు! ఫిబ్రవరి 27న పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్‌–1 పేపర్‌ | Preliminary report of cyber forensic experts to SIT On TSPSC Paper Leak | Sakshi
Sakshi News home page

మిగతా పేపర్లు పెన్‌డ్రైవ్‌ దాటలేదు! ఫిబ్రవరి 27న ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్‌–1 ప్రశ్నపత్రం

Mar 17 2023 3:07 AM | Updated on Mar 17 2023 10:49 AM

Preliminary report of cyber forensic experts to SIT On TSPSC Paper Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజ్‌ వ్యవహారంపై సాంకేతిక దర్యాప్తు చేస్తున్న సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు తమ ప్రాథమిక నివేదికను గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అందించారు. కేవలం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పరీక్ష పత్రాలు మాత్రమే లీక్‌ అయ్యాయని, గ్రూప్‌–1 పేపర్లు పరీక్ష పూర్తయిన తర్వాతే ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని, టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించినవి పెన్‌డ్రైవ్‌ దాటి బయటకు రాలేదని తేల్చారు.

కమిషన్‌ కంప్యూటర్లలో అక్రమ చొరబాట్లు, నెట్‌వర్క్‌ మార్పు చేర్పులను గుర్తించడానికి ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ కాకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.  

రాజశేఖర్‌ సాయంతో..
ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్‌ స్టడీస్, సివిల్‌ పేపర్లకు డిమాండ్‌ ఉండటంతో ముందుగా అవి కా వాలని రేణుక కోరింది. దీంతో రాజశేఖర్‌ సాయంతో కమిషన్‌ కస్టోడియన్‌ శంకరలక్ష్మి కంప్యూటర్‌లోకి చొరబడిన ప్రవీణ్‌ అందులోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఈ పెన్‌డ్రైవ్‌ను అందులోని సమాచారం, ఆధారాలు ధ్వంసం కాకుండా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నిపుణులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సాయంతో విశ్లేషించారు.

ఫోల్డర్‌ ఎప్పుడు క్రియేట్‌ అయ్యింది? ఎప్పు డు మోడిఫై అయ్యింది? చివరిసారిగా ఎప్పుడు యాక్సెస్‌ అయ్యింది? తదితర వివరాలు పరిశీలించారు. పెన్‌డ్రైవ్‌లో ఫిబ్రవరి 27న ఈ ‘క్వశ్చన్‌ పేపర్స్‌’ఫోల్డర్‌ క్రియేట్‌ అయినట్లు తేల్చారు.  

ఆ పేపర్లను ఫోల్డర్‌లోనే ఉంచడంతో..
ఈ ఫోల్డర్‌లో ఉన్న ఏఈ ప్రశ్నపత్రాల ప్రింట్‌ఔట్‌ తీసిన ప్రవీణ్‌ మరుసటి రోజు (ఫిబ్రవరి 28న) రేణుక, ఆమె భర్త లవడ్యావత్‌ డాక్యాలకు అందించాడు. అదే సమయంలో తన వద్ద టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్, అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ), గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన పరీక్షల పేపర్లు కూడా ఉన్నాయని, అభ్యర్థులను చూడాలని రేణుకకు చెప్పాడు.

అయితే ఏఎంవీఐ, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షలకు తేదీ ఖరారు కాకపోవడంతో వాటిపై ఆమె ఆసక్తి చూపలేదు. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం తమ సామాజిక వర్గంలోనే వెతికే ప్రయత్నాల్లో ఉండగా పట్టుబడింది. మరోవైపు గ్రూప్‌–1 పరీక్షలు గతేడాది అక్టోబర్‌లోనే పూర్తయిపోయినా.. శంకరలక్ష్మి ఆ పేపర్లను ఫోల్డర్‌లోనే ఉంచడంతో అవికూడా ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ నుంచి ఈ ఫైల్స్‌ మరో కంప్యూటర్‌లోకి కాపీ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు చెప్పారు. అయితే లీకేజ్‌ జరిగిందనే కోణంలోనే, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ కొనసాగిస్తున్నామని సిట్‌ అధికారులకు తెలిపారు.  

బిట్‌ లాకర్‌ ‘కీ’ని మర్చిపోయారు..
లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీ లోని సాంకేతిక అంశాల్లో ఉన్న మరో నిర్లక్ష్యాన్ని సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు గురువారం గుర్తించారు. అక్రమ చొరబాట్లను గుర్తించడానికి కంప్యూటర్లలో సాధారణంగా బిట్‌ లాకర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ పొందుపరుస్తారు. దీన్ని ఓపెన్‌ చేసి, సమ గ్రంగా విశ్లేషించడం ద్వారా ల్యాన్‌లో కనెక్ట్‌ అయి ఉన్న ఏఏ కంప్యూటర్లు, ఎప్పుడెప్పుడు అక్రమ చొరబాట్లకు గురయ్యాయనేది గుర్తించవచ్చు.

ఈ బిట్‌ లాకర్‌ను విశ్లేషించడానికి తెరవాలంటే దాన్ని ఇన్‌స్టాల్‌ చేస్తున్న సమయంలో వాడిన ‘కీ’తెలిసి ఉండాలి. కానీ టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్లలో అది ఇన్‌స్టాల్‌ అయి ఏళ్లు గడిచి పోవడం, నాటి ‘కీ’ప్రస్తుత అడ్మిన్లకు తెలియకపోవడంతో బిట్‌ లాకర్‌ ఓపెన్‌ కావట్లేదు. ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్ల ద్వారా దానిని తెరవడానికి ప్రయత్నిస్తుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement