అధికారం దక్కలేదనే కేటీఆర్‌ ఆక్రోశం | Ponguleti Srinivasa Reddy Fires On KTR | Sakshi
Sakshi News home page

అధికారం దక్కలేదనే కేటీఆర్‌ ఆక్రోశం

May 7 2026 2:31 AM | Updated on May 7 2026 2:31 AM

Ponguleti Srinivasa Reddy Fires On KTR

ప్రజలు అసహ్యించుకునేలా ఆయన వ్యాఖ్యలు 

రైతు పేరుతో రాజకీయ డ్రామా..బీఆర్‌ఎస్‌ అసలు రంగు బయటపడింది 

రైతు సంగ్రామ సదస్సు కాదు... బీఆర్‌ఎస్‌ ఆక్రోశ సభ: మంత్రి పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్‌లో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్‌ తీవ్ర నిరాశ, అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. వరంగల్‌లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై చింత కాదు..పూర్తిగా రాజకీయ నిరాశ, ఆక్రోశానికి ప్రతిబింబమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై, వారిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతూం అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం..బీఆర్‌ఎస్‌ అసలు రాజకీయ స్వరూపాన్ని బయటపెడుతోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వరంగల్‌లో నిర్వహించిన సభ రైతు సంగ్రామ సదస్సుగా చెప్పడం పూర్తిగా అసత్యమని, అది బీఆర్‌ఎస్‌ ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఆ సమావేశానికి రైతులు రాలేదని కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని విమర్శించారు. రైతుల ప్రాణాలతో ఆటలాడినవారే ఇప్పుడు రైతు మిత్రులమంటూ మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనన్నారు. 

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పంటల బీమా ఎత్తివేసి, వరదలు–వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి అప్పుల బారినుంచి బయటపడే అవకాశం లేకుండా చేసిందే బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. అందుకే రైతులే వారిని అధికారానికి దూరం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తోందన్నారు. పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి, రైతు భరోసా, రుణమాఫీ, బీమా వంటి పథకాలతో రైతులకు నిజమైన అండగా నిలిచామని పేర్కొన్నారు. రైతు పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని, తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేర్చిందన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement