ఇదే నామాట.. నా మాటే శాసనం.. తహసీల్దార్‌పై ఎమ్మెల్సీ సోదరి జులుం..

Political Pressure On Tahsildar In Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలో మరో తహసీల్దార్‌ బదిలీ జరిగింది. అయితే, ఇది సాధారణ బదిలీ కాదు! మైనింగ్‌ మాఫియాను అడ్డుకున్నందుకు వేలేరు తహసీల్దార్‌ విజయలక్ష్మి బ‘ది’లీ అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం పాటు తర్జనభర్జన చేసిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు రాజకీయ నేతల ఒత్తిడికే తలొగ్గినట్లు కనిపిస్తోంది. వేలేరు తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేసి సమస్యకు పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తహసీల్దార్, వేలేరు జెడ్పీటీసీకి నడుమ జరిగిన ఫోన్‌ సంభాషణ బయటకు లీక్‌ కావడంతో మొత్తం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పుడిది అటు ఉద్యోగ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది..
వేలేరు మండలం షోడషపల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యాన చాలాకాలంగా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ తలెత్తిన అంతర్గత వివాదాల కారణంగా మైనింగ్‌పై తరుచూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మొరం తరలిస్తున్న వాహనాలను వేలేరు తహసీల్దార్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. వీటిని సీజ్‌ చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి.. వేలేరు జెడ్పీటీసీ సరిత రంగంలోకి దిగారు.

నేరుగా తహసీల్దార్‌కు ఫోన్‌ చేసిన సీజ్‌ చేసిన వాహనాలకు కేవలం రూ.25వేల చొప్పున మాత్రమే జరిమానా విధించాలని సూచించారు. అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్‌ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని తెలిపారు. దీనికి తహసీల్దార్‌ ససేమిరా అన్నారు. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. జెడ్పీటీసీ – తహసీల్దార్‌ నడుమ మాటామాటా పెరిగినా, తహసీల్దార్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమెను బదిలీ చేయించేందుకు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫలితంగా ప్రజాప్రతినిధి మాట విననందుకు తహసీల్దార్‌ విజయలక్ష్మి అక్కడి నుంచి కలెక్టరేట్‌ బదిలీ అయ్యారు.

గ్రామస్తుల ఫిర్యాదు
తహసీల్దార్‌ – జెడ్పీటీసీ నడుమ వ్యవహారం రచ్చగా మారడంతో గ్రామంలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న వారు తెరపైకి వచ్చారు. ఏకంగా వారు «పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహారం పెద్దగా మారుతుండడంతో ఇరువర్గాల వారికి కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఫోన్‌లో మాట్లాడే క్రమంలో స్థానిక నాయకులపై కూడా జెడ్పీటీసీ అనుచితంగా మాట్లాడటం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో వీరిని కూడా బుజ్జగించేందుకు చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది.

నేనే సమాచారం ఇచ్చా...
మొత్తం వ్యవహారంపై వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత వివరణ ఇస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్యాతండా నుంచి కొందరు మొరం తరలిస్తుండగా తానే అడ్డుకుని తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మైనింగ్‌ అధికారులకు సైతం ఫోన్‌లో సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. ఇక కలెక్టరేట్‌ అధికారులు మాత్రం వేలేరు తహసీల్దార్‌ బదిలీ వ్యవహారాన్ని పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టినట్లుగా చూడాలని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కొన్ని సందర్భాల్లో సహజమే అయినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.  

చదవండి: పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top