సదస్సులో మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్. చిత్రంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, లింబాద్రి తదితరులు
దేశంలో రక్తపాత రహిత నరమేధం జరుగుతోంది
పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
మొత్తంగా 16 కోట్ల ఓట్లకు ‘సర్’దెబ్బ
కొందరిని లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగిస్తున్నారు
బాధితులంతా ఒక్కటై పోరాడాలి
రాజ్యాంగంతో సంబంధం లేని ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారు: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పేరుకే ఓటర్ల జాబితా ప్రక్షాళన. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో జరుగుతున్నది పౌర ప్రక్షాళన అని ఆర్థిక, సామాజిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. సర్‌తో బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, లక్షద్వీప్, అండమాన్‌లో 6 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి దేశవ్యాప్తంగా మొత్తం 16 కోట్ల ఓట్లు పోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో దేశంలో రక్తపాత రహిత నరమేధం జరుగుతోందని, పౌరసత్వాన్ని తుద ముట్టించాలన్నదే వారి ఆలోచన అని పేర్కొన్నారు. 79 ఏళ్ల స్వాతంత్య్రం–పౌరుల హక్కులు అన్న అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
సంఘంగా ఏర్పడి పోరాడాల్సిందే..
‘ఓట్లు కోల్పోయిన వారిలో ముస్లింలు, మైనారిటీలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, కూలీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలు. వీరంతా తమ ఓటు పోయిందనే స్పృహ లేనివారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగిస్తున్నారు. సర్ ప్రక్రియ ఆలోచన తమది కాదని ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. చనిపోయినవారు, స్థానికంగా లేనివారు, డూప్లికేట్ ఓట్లు, చొరబాటుదార్లను జాబితా నుంచి తీసివేసి ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. జరుగుతున్నది పౌర ప్రక్షాళన.10 మందిని చూపించి 90 మంది ఓట్లను తొలగిస్తున్నారు. తాము బతికే ఉన్నామని.. కానీ మృతి చెందారని చెబుతూ తమ ఓటు హక్కు తొలగించారని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలగించిన ఓటర్లలో చొరబాటుదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పటివరకు ఈసీ ప్రకటించలేదు. ఒకవైపు దేశ జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య తగ్గుతోంది. తొలగించిన ఓట్లలో తమకు పడేవి లేవు అని కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. సర్ బాధితులు దేశవ్యాప్తంగా ఒక సంఘంగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఓటు హక్కును కా>పాడుకోగలం..’అని పరకాల అన్నారు.
ఇదేం సామాజిక న్యాయం: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
రాజ్యాంగంతో సంబంధం లేని ప్రక్రియను ఈ దేశంలో సంరక్షించి, ప్రోత్సహిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘జరుగుతున్న పరిణామాలకు, సౌభ్రాతృత్వానికి సంబంధం లేదు. ఏది జరగకూడదో అదే జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని అభివృద్ధి మన దేశంలో జరుగుతోందని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు ఉచిత రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోందని అంటున్నారు. ఇవి రెండు విరుద్ధ వ్యాఖ్యలు. సరైన విద్య, ఉపాధి లేనప్పుడే ఉచిత రేషన్ లబ్ధిదారుల సంఖ్య అధికం అవుతుంది. దేశంలో 84 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 1.5 కోట్ల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఇదేం సామాజిక న్యాయం..’అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


