
ఫంక్షన్ హాళ్లు, వేదిక వ్యయం రూ.లక్షల్లో ..
భోజనాలకూ అడ్డగోలు ఖర్చు
అప్పులపాలవుతున్న కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గతంలో ఇంటి దగ్గరే పెళ్లిళ్లు జరిగేవి. వాకిలి నిండా పచ్చని పందిరి వేసేవారు. పందిళ్లు వేయడానికి, వంటలు వండేందుకు ఇరుగు పొరుగు వాళ్లు, బంధువులు సహకరించేవారు. దీంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. పెళ్లి కొడుక్కి అమ్మాయి తరపు వారు తమ స్తోమత మేరకు కట్నకానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు కట్నకానుకల సంగతి చెప్పనలవి కాదు. పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరగకముందే ఫంక్షన్ హాళ్లను వెతకాల్సిన పరిస్థితి. అనుకూలమైన హాల్ దొరికితే.. ఆయా తేదీల్లోనే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. హాళ్లకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు.
ఇక భోజనాల రిస్క్ ఉండొద్దని క్యాటరింగ్‌కు ఇచ్చేస్తున్నారు. తిండికి కూడా రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫంక్షన్ హాళ్లు, వివాహ వేదిక, డెకరేషన్, మేళతాళం, ఫొటో, వీడియోగ్రఫీ, ఆఖరుకు భోజనాలు.. ఇలా అన్నింటికీ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లి ఖర్చు అమ్మాయి కుటుంబం భరిస్తుంటే, పెళ్లి తరువాత అబ్బాయి తరపున రిసెప్షన్‌లకు చేస్తున్న ఖర్చు కూడా తక్కువేం కాదు. కట్నకానుకలు ఎన్ని వచ్చినా, పెళ్లి, రిసెçప్షన్‌లకు రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొందరు స్టేటస్ కోసం, మరికొందరు నలుగురిలో తాము తక్కువ కాకూడదని అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్నారు.
కట్నంగా బంగారం, ఆస్తులు..
పెళ్లి సంబంధం మాట్లాడుకునే క్రమంలో వరకట్నం ముందే మాట్లాడుకుంటారు. గతంలో సంబంధం నచ్చితే ఇరువైపుల పెద్దలు కూర్చుని.. ఎంతో కొంత కట్నం మాట్లాడుకుని సంబంధం ఖాయం చేసేవారు. అప్పట్లో కొంత నగదు, ఆవుదూడ, బంగారం, సైకిల్, గడియారం, రేడియో తదితరాలు కట్నంగా ఇచ్చేవారు. తరువాతి కాలంలో సైకిల్ స్థానంలో సైకిల్ మోటార్లు, ఈమధ్య కార్లు కట్నంగా అడుగుతున్నారు. వరకట్నంలో డబ్బుకు బదులు బంగారం కట్నంగా తీసుకుంటున్నారు. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, భూములు కూడా కట్నం కింద సమర్పించుకుంటున్నారు. తమ కూతురు గొప్ప ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో తమకంటే ఉన్నత కుటుంబంతో వియ్యం అందుకోవాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ల స్థాయికి తగినట్టు కట్నకానుకలు పెట్టాలని భావిస్తారు. ఇదే సమయంలో చదువు, హోదా, ఉద్యోగం, సంపాదన, ఆస్తులు... ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కట్నకానుకలు మాట్లాడుతున్నారు. కనీసం పది తులాల బంగారం పెట్టాలన్నా రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఇతర ఖర్చులకు కూడా ఎక్కువే ఖర్చు చేస్తున్నారు.
ఫంక్షన్ హాళ్ల ఖర్చే ఎక్కువ..
పెల్లిళ్లలో ఫంక్షన్ హాల్ అద్దె, పెళ్లి మండపాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతున్నాయి. మామూలు ఫంక్షన్ హాల్ తక్కువలో తక్కువ రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా అద్దె తీసుకుంటున్నారు. పెద్ద హాళ్లు, ఏసీ హాళ్లయితే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. పెళ్లి వేదికకు కూడా తక్కువేం కాదు. రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటారు. ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్, భోజనాలయాల వద్ద డెకరేషన్‌కు అదనంగా వసూలు చేస్తారు. హాల్ నిర్వహణతో పాటు విద్యుత్ చార్జీలు కూడా రూ.వేలల్లోనే అవుతున్నాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు.. వెంటనే జనరేటర్ సౌకర్యం కల్పించేందుకు అదనంగా తీసుకుంటారు. ఫంక్షన్ హాల్, వేదిక నిర్వహణ అన్నీ కలిపి.. తక్కువలో తక్కువ రూ.లక్ష నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చవుతాయి.
అప్పులపాలవుతున్న కుటుంబాలు
కూతురి పెళ్లి గొప్పగా చేయాలని, నలుగురి ముందు మనం గొప్పగా ఉండాలనుకుని చాలామంది ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. పెళ్లికయ్యే ఖర్చు కూడా తిరిగి వచ్చేది కాదని తెలిసినా సరే.. స్టేటస్ కోసం చాలా మంది స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు. దీంతో అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. సామాన్యులైతే అప్పులు తీర్చే మార్గం కానరాక.. కొందరి కుటుంబాల్లో కలహాలు మొదలై ఆత్మహత్యలు చేసుకున్నవారు లేకపోలేదు.
ఫొటో, వీడియోగ్రఫీ ఖరీదైన వ్యవహారం
పెళ్లి ఫొటోలు, వీడియోలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అల్బంలు, సీడీలు తయారు చేయించుకుంటారు. ఫొటో, వీడియోగ్రఫీలో అనేక ఆధునిక పరికరాలు వచ్చాయి. డ్రోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీయడం వాటిని మిక్సింగ్, అల్బంలు తయారు చేయడానికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ల పేరుతో జరుగుతున్న వ్యవహారం మరింత ఖరీదైపోయింది. మంగళవాయిద్యాలు, వేద పండితులకు కూడా అయ్యే ఖర్చు రెట్టింపయ్యింది. పెళ్లి బట్టలకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.
క్యాటరింగ్ ఖర్చు ఎక్కువే..
ఇంతకుముందు ఇంటివాళ్లు, చుట్టాలు కలిసి వంటలు చేసేవారు. పెళ్లికి వచ్చిన వారందరికీ కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు. ఇప్పుడు భోజనాల ట్రెండ్ కూడా మారింది. ఎంత మంది వస్తారో అంచనా వేసుకుని.. అంతమందికి ఎన్ని రకాల వంటలు చేయాలి, ఏయే రకం స్వీట్లు పెట్టాలి, మాంసాహారమైతే మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్.. ఇలా రకరకాల వంటలు, కూరగాయల భోజనాలైతే ఎన్ని రకాల కూరలు వండాలి, పండ్లు, ఐస్ క్రీం, కిళ్లీ... ఇలా అన్ని లెక్కలు గట్టి ప్లేట్ భోజనానికి కనీసం రూ.250 నుంచి రూ.5 వేల దాకా వెచ్చిస్తున్నారు. చిన్న కుటుంబాలకైతే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాక భోజనాలకు ఖర్చవుతుండగా, పెద్ద కుటుంబాలు, ఉన్నతంగా చేయాలనుకునేవారు రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా భోజనాలకు వెచ్చిస్తున్నారు.