చుట్టూ పోలీసుక్యాంపులతో సొంతూరువదిలిన మావోయిస్టు నేత
ఆ తర్వాతే ఆపరేషన్ కగార్ మొదలు.. దీంతోకర్రెగుట్టల పైకి, తర్వాత దక్షిణ బస్తర్‌కు హిడ్మా
సొంత ఇలాకాలోనూ రక్షణ లేని పరిస్థితి..సరిహద్దుల్లో సంచరిస్తూ ఎన్‌కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్) తొలి లక్ష్యం గెరిల్లా దాడుల్లో ఆరితేరిన హిడ్మాను కట్టడి చేయడమే. అందుకే కగార్ మొదలవడమే ఆలస్యం హిడ్మా సొంతూరైన సుక్మా జిల్లాలోని పువర్తిపై భద్రతా దళాలు దృష్టి పెట్టాయి. ఈ గ్రామంలోనే హిడ్మా సొంతింటితో పాటు ఆయన కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉండేది.
ఇందులో సోలార్ సిస్టమ్, బ్యాటరీలు, కమ్యూనికేషన్ వైర్‌లెస్ సెట్, ఒక హాలు, కిచెన్ ఉన్నాయి. ఇక్కడి నుంచే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను హిడ్మా నిర్వహించేవాడు. ఈ ఏరియాలో హిడ్మా ఉన్నంత వరకు కూంబింగ్‌లు చేపట్టడం ప్రమాదమని భావించిన భద్రతా దళాలు పువర్తి చుట్టూ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఆ ప్రాంతంపై పట్టు బిగించాయి. దీంతో 2023 డిసెంబర్‌లో పువర్తిని విడిచిన హిడ్మా వేరే ప్రాంతానికి మకాం మార్చాడు.
హిడ్మా వెళ్లిన తర్వాతే..
పువర్తి నుంచి హిడ్మా వెళ్లిపోయినట్టుగా నిర్ధారించుకున్నాకే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో పువర్తిలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి హిడ్మా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను భద్రతా దళాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి. అయితే ఏ క్షణమైనా హిడ్మా దాడి జరగొచ్చనే ఉద్దేశంతో సెంటర్ చుట్టూ కందకాలు తవి్వ, బంకర్లు నిర్మించుకుని ఏడాది పాటు అప్రమత్తంగా వ్యవహరించాయి.
అయితే హిడ్మా పువర్తిని విడిచాక కర్రెగుట్టలను తన ప్రధాన స్థావరంగా మార్చుకున్నాడు. దీంతో అతన్ని లక్ష్యంగా చేసుకుని 2025 జనవరిలో కర్రెగుట్ట దిగువన ఉన్న పెద్ద ఊట్ల దగ్గర భద్రతా దళాలు మెరుపుదాడి చేశాయి. కానీ ఈ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న హిడ్మా, శత్రు దుర్భేధ్యమైన కర్రెగుట్టల పైకి తన డెన్ మార్చాడు.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్
హిడ్మాను టార్గెట్ చేసుకుని 2025 ఏప్రిల్ 21న కేంద్రం ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’చేపట్టింది. ఏకంగా కేంద్ర ఐబీ చీఫ్ తపన్‌దేక ఇక్కడకు వచ్చి ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. నాలుగు హెలికాప్టర్లు, డ్రోన్లు, 25 వేల మంది పారా మిలిటరీ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ఆపరేషన్‌ను ముందే పసిగట్టిన హిడ్మా కర్రెగుట్టల నుంచి ఏప్రిల్ 18నే తప్పుకున్నాడు.
అప్పటి నుంచి ఇంద్రావతి నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో హిడ్మా తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ మే 21న ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్, ఆ తర్వాత ఇంద్రావతి ఫారెస్ట్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, గరియాబంద్ దగ్గర మోడెం బాలకృష్ణ, ఏఓబీ పరిధిలోని అల్లూరి జిల్లాలో గాజర్ల రవి ఎన్‌కౌంటర్ అయ్యారు. దీంతో మరోసారి తన ఇలాకా అయిన దక్షిణ బస్తర్‌కు హిడ్మా వచ్చాడు.
లొంగుబాట్లతో...
ఆదివాసీయే అయిన హిడ్మా పట్ల స్థానిక ఆదివాసీల్లో విపరీతమైన ఆరాధనా భావం ఉంది. దీంతో ఆయన సొంత ఇలాకాలో (బీజాపూర్, సుక్మా జిల్లాలు) హిడ్మాను పట్టుకోవడం అంటే చెరువులోని చేపను ఉత్తి చేతులతో పట్టుకోవడానికిప్రయతి్నంచడం లాంటిదనే అభిప్రాయం ఉండేది. కానీ అక్టోబర్‌లో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను, కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్నతో పాటువందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు.
దక్షిణ బస్తర్‌లో ఇరవై ఏళ్లకు పైగా పనిచేసిన చంద్రన్న, ప్రభాత్ కూడా అడవిని వీడారు. దీంతో దక్షిణ బస్తర్‌లో ఉన్న సేఫ్‌జోన్లలో కూడా హిడ్మాకు రక్షణ లేని పరిస్థితి ఎదురైంది. చివరకు దక్షిణ బస్తర్‌తోసరిహద్దులు పంచుకుంటున్న తెలంగాణ, ఒడిశా గుండా సంచరిస్తూ ఏపీలోని మారేడుమిల్లి దగ్గర ఎన్‌కౌంటర్‌లోమరణించాడు.
రెండేళ్ల క్రితం సొంతూరు పువర్తిని వదిలిన తర్వాత.. భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేయడం కంటే, వారి కళ్లుగప్పి తప్పించుకోవడంపైనే హిడ్మా ఎక్కువగా దృష్టి సారించేలా భద్రతాదళాలు వ్యూహం పన్నాయి. ప్రస్తుతఎన్‌కౌంటర్‌తో వారి వ్యూహం ఫలించినట్టయింది.
పక్కా ప్లాన్‌తోనే..!
హిడ్మా కదలికలపై నిఘా పెట్టిన గ్రేహౌండ్స్ దళాలు
మరోవైపు తల్లి ద్వారా లొంగుబాటు ప్రతిపాదనలు
నాలుగు వారాల కిందటే దండకారణ్యం వదిలిన హిడ్మా?
లొంగుబాటు చర్చలు జరుపుతూనే దేశం దాటే యత్నం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా, మరో మావోయిస్టు నేత దేవ్‌జీ టార్గెట్‌గా నెల రోజులుగా భద్రతా దళాలు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లోనే తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ సమయంలో పెరిగిన నిర్బంధం కారణంగా అజ్ఞాత జీవితం కష్టమనే అభిప్రాయానికి వచ్చి న హిడ్మా టీమ్‌లోని కొందరు కీలక నేతలు లొంగుబాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు తమకు ఉన్న కాంటాక్ట్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కొందరు కీలక సభ్యులు గ్రేహౌండ్స్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే హిడ్మాను కూడా లొంగిపొమ్మంటూ పోలీసులు, ప్రభుత్వ వర్గాలు రాయబారం పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో హిడ్మా దండకారణ్యం విడిచిపెట్టినట్టు సందేహం కలిగిన వెంటనే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ పువర్తికి వెళ్లి హిడ్మా తల్లిని కలిశారు.
లొంగిపోవాలంటూ ఆమె ద్వారా హిడ్మాకు సందేశం పంపారు. ‘ఎక్కడున్నావ్ బిడ్డా సజీవంగా ఇంటికి రా.. ఇక్కడే కష్టపడి బతుకుదాం.. కలో గంజో తాగుతూ జీవిద్దాం.. నువ్వు ఎక్కడున్నావో ఇంటికి వచ్చేయ్.. ఎక్కడున్నావో చెప్పు నేనైనా వస్తా... రెండూ లేదంటే నేనే నిన్ను వెదుక్కుంటూ అడవి బాట పడతా..’అంటూ ఆమె ద్వారా పంపిన సందేశం హిడ్మాకు చేరిందో, లేదో కానీ వారంలోగానే ఆయన ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.
దేశం దాటేందుకు ప్రయత్నం!
లొంగుబాటు ప్రతిపాదనపై హిడ్మా ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా తిరస్కరించకుండా.. అలాగని వెంటనే ఒప్పుకోకుండా జనవరి వరకు వేచి చూసే ధోరణి అవలంబించా లని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసు వర్గాలతో వైరాన్ని తగ్గించుకునే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే సముద్ర మార్గం గుండా దేశం దాటి సేఫ్ జోన్‌కు వెళ్లేందుకు ప్రయతి్నంచినట్టు సమాచారం. మరోవైపు హిడ్మా అనుచరవర్గం కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత పోలీస్ వర్గాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముందు వెళ్లిన దళాలు సురక్షితంగా వెళ్లేలా చేసి..
రెండు వారాల కిందట కర్రెగుట్టల పరిసరాలను విడిచిన హిడ్మా బృందం చిన్న జట్లుగా విడిపోయి తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయతి్నంచగా.. ఇక్క డ నిఘా ఎక్కువగా ఉండడం, ఆదివాసీ గ్రామాల్లో ఉండే జనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో స్థానికులను కలవడం కష్టంగా మారింది. దీంతో ఒడిశా మీదుగా ఏపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
మావోల కదలికలపై నిఘా వేసిన బలగాలు అనువైన సమయం కోసం ఓపిగ్గా వేచి చూశాయి. ప్లాన్ ప్రకారం ముందుగా వెళ్లిన బ్యాచ్‌లకు సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాయి. దీంతో నమ్మకం కుదిరిన హిడ్మా తన బృందంతో ఏపీలోకి వచ్చారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టగా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
ఆజాద్ ఎక్కడ?
అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజన్ కార్యదర్శిగా ఉన్న కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం గడిచిన నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆజాద్ పర్యవేక్షణలో ఉన్న అల్లూరి జిల్లాలోకి హిడ్మా తన బృందంతో చేరుకోవడమనేది కాకతాళీయంగా జరిగిందా లేక పోలీసులు పన్నిన వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది.


