నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక: అప్‌డేట్స్‌

Nizamabad MLC By Election Today Polling Begins Updates - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు.

వార్‌ వన్‌ సైడ్‌: బాజిరెడ్డి
నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమన్నారు. ఆమె రాకతో రాజకీయాలు మారబోతున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు.

కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు: గణేష్‌ గుప్తా
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి. కవిత సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. నిజామాబాద్‌కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. - టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గణేష్ గుప్తా

  • టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అనంతరం బోధన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.
  • ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినయోగించుకునే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్ క్యాంప్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కార్పొరేటర్లంతా బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రాజేశ్వర్ అక్కడికి చేరుకున్నారు.

24 మందికి కరోనా పాజిటివ్‌
ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 824 మంది మొత్తం ఓటర్లు ఉండగా 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్‌ బాధితులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా వెలువడే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

పార్టీల బలాబలాలు 
జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువే టీఆర్‌ఎస్‌కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు.

ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్‌ఎస్‌ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top