ఉత్తర రింగు అంచనా వ్యయం 18,500 కోట్లు | NHAI submits new DPR to the Centre | Sakshi
Sakshi News home page

ఉత్తర రింగు అంచనా వ్యయం 18,500 కోట్లు

Jun 15 2025 1:56 AM | Updated on Jun 15 2025 1:56 AM

NHAI submits new DPR to the Centre

కేంద్రానికి కొత్త డీపీఆర్‌ను సమర్పించిన ఎన్‌హెచ్‌ఏఐ

ఆరు వరుసల రోడ్డు, ఎనిమిది వరుసల వంతెనలతో డీపీఆర్‌ 

162 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.9,500 కోట్ల ఖర్చు

పాత డీపీఆర్‌తో పోలిస్తే రూ.4,200 కోట్లు పెరిగిన అంచనా

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి రూ.18,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈమేరకు కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సవరించిన డీపీఆర్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఏఐ అందజేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసలకు బదులు ఒకేసారి ఆరు వరుసలుగా, దానిమీద నిర్మించే వంతెనలు, ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్లను ఎనిమిది లేన్లుగా నిర్మించాలని ఇటీవల కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, దీని నిర్మాణానికి కొత్త డీపీఆర్‌ను రూపొందించారు. నాలుగు వరుసలుగా నిర్మించాలని తొలుత నిర్ణయించిన సమయంలో రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం నిర్మాణ వ్యయం రూ.14,300 కోట్లుగా తేలగా, ఇప్పుడు మరో రూ.4,200 కోట్లు పెరిగింది.

నిర్మాణ వ్యయం రూ.9,600 కోట్లు
ఉత్తర భాగం దాదాపు 162 కి.మీ. నిడివితో ఉండనుంది. దీని నిర్మాణానికి రూ.9,600 కోట్లు ఖర్చు అవుతుందని తాజా డీపీఆర్‌లో అంచనా వేశారు. మూడు నెలల క్రితం జరిగిన పీఎం గతిశక్తిలోని నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూపు సమావేశంలో, రోడ్డు నాలుగు వరుస లుగా నిర్మిస్తే కేవలం ఐదారేళ్లలోనే ట్రాఫిక్‌ రద్దీ పెరిగి ఇరుకుగా మారే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. అందువల్ల కనీసం 15 ఏళ్లపాటు విస్తరించాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మించాలని నిర్ణయించారు. 

రోడ్డు పొడవునా రెండు వైపులా సర్వీసు రోడ్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ లూప్‌ స్ట్రక్చర్లు, 3 భారీ వంతెనలు, 105 చిన్న వంతెనలు, 85 కల్వర్టులుంటాయి. ఈ వంతెనలన్నీ ఒకేసారి ఎనిమిది వరుసలుగా ఉంటాయి. ఫలితంగా రోడ్డు నిర్మాణానికి భారీగా ఖర్చు కానుంది. ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరం. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. 

గ్రామాలవారీగా అవార్డులను పాస్‌ చేస్తున్నారు. త్వరలో నిర్వాసితులకు పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. డీపీఆర్‌లో ఈ భూసేకరణ పరిహారాన్ని రూ.5,500 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయి. అలైన్‌మెంటు పరిధిలో ఉన్న భూమిలోని స్తంభాలు, పైపు లైన్లు లాంటి వాటిని తరలించేందుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. 

టెండర్ల ప్రక్రియలో జాప్యం..
నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఎన్‌హెచ్‌ ఏఐ టెండర్లు పిలిచింది. ఆ తర్వాత దీన్ని ఆరు వరుసలు, వంతెనలను ఎనిమిది వరుసలకు పెంచటంతో పాత టెండర్లనే సవరించి గడువు పొడిగిస్తారా, కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తారా అన్నదానిలో స్పష్టత రాలేదు. ఓవైపు అవార్డులు పాస్‌ చేస్తూ, పరిహారం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, టెండర్ల విషయంలో మాత్రం ఎటూ తేల్చకుండా జాప్యాన్ని కొనసాగిస్తున్నారు. 

తాజాగా కొత్త డీపీఆర్‌ను సమర్పించినందున దీని ఆధారంగా ఖర్చును సవరించి ఆ మేరకు టెండర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతానికి ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి మండలిలోని ఆర్థిక వ్యవహారాలు చూసే కమిటీ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. త్వరలో ఆ ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. ఆ వెంటనే టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తిస్తారని పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement