ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి 

Nationwide Strike Hits Banking Operations Transport Services - Sakshi

వామపక్షాల సమ్మెలో చాడ డిమాండ్‌

కార్మికుల సమ్మె పాక్షికం 

సాక్షి, హైదరాబాద్‌/ సుల్తాన్‌బజార్‌: కార్మికుల రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో మొదటిరోజు సోమవారం పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. బ్యాంకుల్లోనూ కొంతమేరకు పని స్తంభించడంతో.. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. సింగరేణిలో సమ్మె ప్రభావం బలంగా కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

సమ్మెలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, ఎంసీపీఐ (యు) తదితర పార్టీలు పాల్గొన్నాయి. సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహించారు. నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్మికులతో పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు అంతే లేకుండా పోయిందని, శిశుపాలుడి వంద తప్పుల మాదిరిగా ప్రజలు ఓపిక పడుతున్నారని, సహనం నశిస్తే కేంద్రాన్ని కూలదోస్తారన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నర్సింహారావు చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ శ్రేణులు పలుచోట్ల కేంద్రం అవలంబిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెలో సంఘీభావంగా పాల్గొన్నారు. రైతు సంఘాలు, మహిళా సమాఖ్య, విద్యార్థి, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు.

కోఠిలో ధర్నా
కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అఖిలభారత బ్యాంక్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ (ఏఐబీఇఏ), అఖిలభారత బ్యాంక్‌ అధికారుల అసోసియేషన్‌ (ఏఐబీఓఏ) సంయుక్త ఆధ్వర్యంలో కోఠిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఇండియా ప్రాంగణంలో ధర్నా జరిగింది. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top