అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి | Father And Son Found Dead Under Suspicious Circumstances In Nalgonda Deverakonda, More Details Inside | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి

Jun 9 2026 10:11 AM | Updated on Jun 9 2026 10:39 AM

Nalgonda District Devarakonda Father And Son Incident

నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్‌ శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్‌రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటరీ్మడియట్‌లో చేరాడు. 

సోమవారం ఉదయం ప్రశాంత్‌రెడ్డిని హాస్టల్‌లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్‌కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్‌రెడ్డికి ఫోన్‌ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్‌రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్‌పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement