Mukhra K Village: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే.. 

Mukhra K Village Brought Recognition To Adilabad District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఇచ్చోడ(బోథ్‌): వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలతో జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుతోన్న ముఖరా (కె) గ్రామం తాజాగా మరో జాతీయస్థాయి గుర్తింపును పొందింది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆ గ్రామం గురించి చేసిన ట్వీట్‌లో ప్రశంసించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ లోగోని ప్రభుత్వ భవనాల గోడలపై ఆవిష్కరించడంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొంది.

దీనికి ప్రతిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రీ ట్వీట్‌ చేస్తూ ‘అవును, నిజమే! ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణలోని ముఖరా(కె)పలు మైలు రాళ్లను దాటుతోంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలు ఎలా ఉండాలి? అనే అంశంపై సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామపరిపాలకులు, సిబ్బందికి, ప్రజలకు అభినందనలు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.  

ఇదీ సృజనాత్మకత 
మన రాష్ట్రం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘సశక్త్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌’పేరుతో ఆయా లోగోలను గ్రామపంచాయతీ భవనం ప్రహరీపై ముద్రించారు. ‘తెలంగాణలో విరామం ఎరుగని నిరంతర పంచాయతీ అభివృద్ధి, బలమైన పంచాయతీ, సుస్థిరమైన అభివృద్ధి’అనే ట్యాగ్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. ఈ పెయింటింగ్స్‌ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతా ల ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ గ్రామ సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ సుభాశ్‌ గాడ్గే, వార్డు సభ్యులు, సిబ్బంది, అధికారులు, ప్రజలకు జాతీయస్థాయిలో అభినందనలు అందుతున్నాయి. 

500 జనాభా ఉన్న ముఖరా(కె) గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలోనే మొదటి మలమూత్ర విసర్జనరహిత గ్రామంగా ఎంపికైంది.  

పచ్చదనంలోనూ, స్వచ్ఛతలోనూ అగ్రగామిగా నిలిచి జాతీయస్థాయి అవార్డు సైతం అందుకుంది.  

గ్రామంలో మూడేళ్లుగా గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా 40 వేల మొక్కలు నాటారు. పల్లెప్రకృతి వనం, వైకుంఠధామంతో పాటు రోడ్డుకు ఇరువైపులా, ప్రతి ఇంటి అవరణలో వీటిని నాటి సంరక్షిస్తున్నారు.  

గ్రామంలో పెళ్లయిన నూతన జంటతో వారి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడి పల్లె ప్రకృతి వనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది.  

డిజిటల్‌ లిటరసీలోనూ ఈ గ్రామం జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2016లో పెద్దనోట్ల రద్దుతో దేశమంతా ఇబ్బందులు పడినా ఈ గ్రామస్తులు మాత్రం దీన్ని అధిగమించారు. అప్పటికే వందశాతం నగదు రహిత గ్రామంగా పేటీఎం, స్వైపింగ్‌ మిషన్ల ద్వారా డబ్బులు ఖాతాల నుంచి తీసుకొని రూపే కార్డుల ద్వారా లావాదేవీలు చేపట్టింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top