
మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎదురవుతున్న సవాళ్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి, మల్లు రవి, చామల కిరణ్, రఘునందన్
డీపీఆర్‌లు ఇచ్చి 9 నెలలైనా ఆమోదించలేదు
ఈ ప్రాజెక్టు కోసం కలిసికట్టుగా పోరాడుదాం
రాష్ట్రంలోని ఎంపీల సమావేశంలో భట్టి, కోమటిరెడ్డి
ఆదాయం ఎలా పంచుకుంటారని బీజేపీ ఎంపీల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై 9 నెలల క్రితమే కేంద్రానికి డీపీఆర్‌లు అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఆమోదించకపోవడం అన్యాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న సవాళ్లపై శనివారం పార్క్‌హయత్ హోటల్‌లో ప్రభుత్వం వివిధ పార్టీల ఎంపీలతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్ రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, అన్ని పార్టీల ఎంపీలు సహకరిస్తేనే మెట్రో రెండో దశను సాధించుకోగలమని చెప్పారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, మన రాష్ట్రంపై మాత్రం కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎల్‌అండ్‌టీతో ఎలా ముందుకెళ్తారు?
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో మెట్రో మొదటి దశ నిర్మాణం చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థతో కలిసి రెండో దశపై ఎలా ముందుకెళ్తారని బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రెండోదశ పూర్తయితే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగి ఎల్‌అండ్‌టీకి కూడా ఆదాయం లభిస్తుంది. ప్రయాణికుల నుంచి టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎల్‌అండ్‌టీతో కలిసి ఎలా పంచుకుంటారు? విద్యుత్ భారం, నిర్వహణ ఖర్చులపై కూడా స్పష్టత రావాల్సి ఉంది’అని పేర్కొన్నారు.
ఎంపీలు లేవనెత్తిన సందేహాలపై ఎనీ్వఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరాన్ని రాజకీయాలకతీతంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ట్రిపుల్ ఆర్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ లోపలి వైపున రవాణా వ్యవస్థను ఎంత అభివృద్ధి చేసుకుంటే ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ అంతగా పోటీ పడుతుందని అభిప్రాయపడ్డారు.