
చెంచు మహిళ మృతదేహాన్ని అడవి మధ్యలోనే వదిలేసిన మార్చురీ వ్యాన్ డ్రైవర్
సాక్షి, నాగర్‌కర్నూల్/ మన్ననూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతిచెందిన చెంచు మహిళ మృతదేహాన్ని మార్చురీ వ్యాన్ డ్రైవర్ దారి మధ్యలోనే అడవిలో వదిలిపెట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈర్లపెంటకు చెందిన చెంచు మహిళ మండ్లి గురువమ్మ (30) పది రోజుల కిందట అనారోగ్యంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. మహిళ మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంటకు తరలించేందుకు అధికారులు మార్చురీ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారి పక్కన ఫర్హాబాద్ ఫారెస్ట్ గేటు వద్దకు రాగానే అడవి లోపలికి వెళ్లేందుకు దారి సరిగా లేదంటూ డ్రైవర్ మృతదేహాన్ని వ్యాన్ నుంచి దించి కిందపెట్టేశాడు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వరకు గురువమ్మ మృతదేహంతో పాటు ఫారెస్ట్ గేటు వద్దనే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు ఆటో ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఈర్లపెంటకు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్చురీ వ్యాన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు మన్ననూర్ ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ రోహిత్‌రెడ్డి తెలిపారు.