
కేంద్రమంత్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
యూరియా నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల
యూరియాపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లతో ఫోన్‌లో మాట్లాడిన నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: రైతులకు టోకెన్లు జారీచేసి యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. యూరియా డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు నిల్వలున్న జిల్లాల నుంచి తక్షణమే తరలించి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
పట్టాదార్ పాస్ పుస్తకాలను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామని చెప్పినా, 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు. ఎర్ర సముద్రం నౌకాయానంలో ఇబ్బందులతో మన దేశానికి దిగుమతి కావాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికితోడు, రామగుండం ఎరువుల కార్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.
రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్రానిదని, కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతుల ప్రయోజనాలకంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూలైన్‌లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో స్టాక్‌ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని అధికారులకు సూచించారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి ఆగిపోయి..
రాష్ట్రానికి కేటాయించిన స్వదేశి యూరియాలో ఆర్‌ఎఫ్‌సీఎల్ లో ఉత్పత్తి ఆగిపోయి, దాదాపు 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయలేదని తుమ్మల చెప్పారు. ఈ 63 వేల మెట్రిక్ టన్నుల యూరి యా వెంటనే సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఫోన్‌లో తుమ్మల కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫ రాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోనూ ఫోన్‌లో మాట్లాడారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ లో తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల ని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌ను తుమ్మల ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.