తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఝలక్‌! | Minister Ponnam Prabhkar Key Comments On TGSRTC | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఝలక్‌!

May 28 2026 7:35 AM | Updated on May 28 2026 7:35 AM

Minister Ponnam Prabhkar Key Comments On TGSRTC

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టీసీలో కార్మిక సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం.. ఈ రెండు అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం వెల్లడించాలి’.. మేడే రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి వారికి సూచించిన మాట ఇది.

‘మాకు యూనియన్‌ ఎన్నికలు అవసరం లేదు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనమే ముఖ్యం, ఆ మేరకే ఆమోద లేఖ సమర్పించాలి’ అని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేయటంతో కార్మిక సంఘాల నేతలు ముందు విలీన ప్రక్రియే జరపాలని, జూన్‌ రెండు రాష్ట్రావతరణ దినోత్సవం రోజున అపాయింటెండ్‌ డేట్‌ను ప్రకటించాలని పేర్కొంటూ యూనియన్ల వారీగా ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. దీంతో జూన్‌ రెండున అపాయింటెడ్‌ డేట్‌పై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని వెయ్యి కళ్లతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.

అయితే, బుధవారం కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, త్వరలో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ తర్వాతనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన సూచనల ప్రకారం తాము వెల్లడించిన అభిప్రాయానికి ఇది విరుద్ధంగా ఉండటంతో కార్మికులు కంగు తినాల్సి వచ్చింది. మొదట గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన సంఘం ప్రతినిధులను.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ విధివిధానాలు రూపొందించేందుకు సిఫారసు చేసే అధ్యయన కమిటీలో అధికారులతోపాటు నియమించనున్నట్టు మంత్రి వెల్లడించారు.  

నేతల ఒత్తిడితోనే? 
ముఖ్యమంత్రి సూచించటంతో, కార్మికుల ఆకాంక్షల మేరకు కార్మిక సంఘాల నేతలు విలీనమే కావాలంటూ ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. కానీ, లోపాయికారిగా మాత్రం యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని పలువురు నేతలు గట్టిగా ప్రయత్నించారు. యూనియన్లు లేకుంటే ప్రభుత్వం కార్మికులను పట్టించుకోదని, యూనియన్లు ఉండాల్సిందేనని కొందరు నేతలు మాట్లాడిన ఆడియో రికార్డులు ఆ సమయంలో వైరల్‌ అయ్యాయి. దీంతో యూనియన్లు కాదు, విలీనం కోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మికులు సంఘాలకతీతంగా నేతలను డిమాండ్‌ చేశారు. కానీ, చివరకు కొందరు నేతల ఒత్తిడే ఫలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన ప్రకటనను యూనియన్ల నేతలు ఖండించారు.   

Advertisement
 
Advertisement
Advertisement