ప్రజల కోసం బ్రహ్మాండమైన  ప్యాకేజీ | Minister KTR : Inauguration Of Double Bed Room Houses In Dundigal Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం బ్రహ్మాండమైన  ప్యాకేజీ

Published Fri, Sep 22 2023 3:28 AM | Last Updated on Fri, Sep 22 2023 11:55 AM

Minister KTR : Inauguration Of Double Bed Room Houses In Dundigal Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/దుండిగల్‌: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాలను కేటీఆర్‌ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘డబుల్‌’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు
పేదలు, రైతులపై కేసీఆర్‌కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్‌ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్‌లోని కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు.

తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్‌ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్‌ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. 

ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ?
మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. 

చాయ్‌ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు
ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్‌ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్‌ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్‌ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement