మేడిగడ్డ కింద అగాధం! | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ కింద అగాధం!

Published Sat, May 25 2024 3:28 AM

Medigadda Barrage Repair Updates: Emergency repairs ongoing at barrage

ఏడో బ్లాకులోని 20వ పియర్‌ ముందు బయటపడిన గొయ్యి 

దాని నుంచి దిగువకు వెళ్తున్న నీటి ఊటలు 

బ్యారేజీ పునాదుల కింద భారీగా ఇసుక కొట్టుకుపోయినట్టు గుర్తింపు 

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బొరియ ఏర్పడిందనే దానిపై అస్పష్టత 

జియోఫిజికల్‌ పరీక్షలు చేస్తే బయటపడే అవకాశం 

బ్యారేజీ వద్ద కొనసాగుతున్న అత్యవసర మరమ్మతులు 

దిగువన సీసీ బ్లాక్‌లకు రిపేర్లు.. ఇసుక మేటల తొలగింపు

సాక్షి, హైదరాబాద్‌/ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ దిగువన అగాధం బయటపడింది. కుంగిపోయిన ఏడో బ్లాకులోని 20వ పియర్‌ ముందు భాగంలో గురువారం పెద్ద గొయ్యి ఏర్పడింది. అది బొరియలా బ్యారేజీ కింది వరకు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ గొయ్యి నుంచి నీటి ఊట ఏర్పడి దిగువకు ప్రవహిస్తోంది. గతంలో వరదల సందర్భంగా బ్యారేజీ పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి.. ఒక చివరి నుంచి మరో చివరి వరకు సొరంగంలా అగా ధం ఏర్పడి ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు.

దానికి సంబంధించి గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌), ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆరీ్ట) పరీక్షలు చేశారు. వాటి ఆధారంగా బ్యారేజీ కింద 12 వేల క్యూబిక్‌ మీటర్ల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో అగాధం ఉండి ఉంటుందనే భావనకు వచ్చారు. ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి దానికి సంబంధించినదేనని చెప్తున్నారు. 

అగాధంతోనే బ్యారేజీ కుంగిపోయి.. 
గతేడాది అక్టోబర్‌ 21న భారీ శబ్ధంతో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్‌లు కుంగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమి టీని ఏర్పాటు చేసింది. బ్యారేజీని పరిశీలించిన కమిటీ.. 2019 వరదల సమయంలోనే బ్యారేజీలో సమస్యలు తలెత్తాయని.. మరమ్మతులు నిర్వహించకపోవడంతో పరిస్థితి దిగజారిందని తమ మధ్యంతర నివేదికలో పేర్కొంది. 2019 జూన్‌లోనే సమస్య ఏర్పడినా, బ్యారేజీలో పూర్తి నీటి నిల్వను కొనసాగించారని.. ఈ క్రమంలో బ్యారేజీపై ఒత్తిడి పెరిగి పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయిందని తెలిపింది.

బ్యారేజీకి సంబంధించి జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు చేయించాలని సూచించింది. పలు రకాల పరీక్షలు చేసిన నిపుణులు.. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోయి భారీ అగాధం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. తాజాగా బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం దీన్ని ధ్రువపరుస్తోందని అంటున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తే.. ఈ అగాధం ఏమేర ఉందనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. 

మొరాయించిన గేట్లు ఎత్తే క్రమంలో.. 
గత ఏడాది అక్టోబర్‌ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే బ్యారేజీలోని 85 గేట్లకుగాను 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. కుంగిన బ్లాకులోని 15వ నంబర్‌ నుంచి 22వ నంబర్‌ వరకు గేట్లు మొరాయించాయి. వాటిని అలాగే వదిలేశారు. వానాకాలం వస్తుండటంతో నీటి ప్రవాహం మొత్తంగా కిందికి వెళ్లేలా.. అన్ని గేట్లను ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఇటీవలి నివేదికలో పేర్కొంది. కుంగిన, పగుళ్లు ఏర్పడిన పియర్ల మధ్య ఉన్న గేట్లను కూడా జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. దీంతో ఈ నెల 15న 15వ గేటును ఎత్తారు. గురువారం 16వ నంబర్‌ గేటును ఎత్తడానికి ప్రయతి్నంచగా.. బ్యారే జీ కింది నుంచి భారీ శబ్ధా్దలు, ప్రకంపనలు వచ్చా యి. దాంతో గేట్లు ఎత్తే ప్రయత్నాలను నిలిపేశారు. 

వేగంగా అత్యవసర మరమ్మతులు 
నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు బ్యారేజీ వద్ద అత్యవసర మరమ్మతులు కొనసాగుతున్నాయి. బ్యారేజీ ఎగువన గేట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌లను క్రేన్‌ సాయంతో సరిదిద్దుతున్నారు. అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నారు. షీట్‌ఫైల్స్‌ కూడా బ్యారేజీ వద్దకు చేరుకున్నాయని, వాటిని అమర్చే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం, మరమ్మతుల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. 

పునాదులకు బోర్‌ డ్రిల్లింగ్‌.. 
మేడిగడ్డ బ్యారేజీ కింద అగాధం ఉన్నట్టు తేలడంతో.. బ్యారేజీ ర్యాఫ్ట్‌ (పునాది)కు బోర్‌ హోల్‌ డ్రిల్లింగ్‌ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఆ రంధ్రం ద్వారా గ్రౌటింగ్‌ (సిమెంట్, ఇసుక మిశ్రమం నింపడం) చేయనున్నారు. కుంగిన 7వ బ్లాక్‌లోని 21వ పియర్‌ ముందు కూడా డ్రిల్లింగ్‌ ప్రారంభించారు. దానిద్వారా జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలను కొనసాగించనున్నారు

ఎన్డీఎస్‌ఏ కమిటీ సిఫార్సుల అమలుపై నేడు భేటీ 
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సుల అమలుకు చర్యలు మొదలయ్యాయి. దీనిపై ఈఎన్సీ (జనరల్‌) చైర్మన్‌గా నలుగురు అధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం శనివారం జలసౌధలో జరగనుంది. బ్యారేజీల రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక చర్యలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement