నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..! | Married woman ends life in khammam | Sakshi
Sakshi News home page

నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..!

Apr 18 2026 10:34 AM | Updated on Apr 18 2026 11:48 AM

Married woman ends life in khammam

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌లోని ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన నవిత(34) కు 11ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గుప్త సాయిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లు, ఏడు నెలల కుమారులు ఉన్నారు. గతంలో ఓ ఎమ్మెల్యేకు చెందిన డెవలపర్‌లో ఉద్యోగం చేసిన నవిత సొంతంగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయింది. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పుల ఊబి నుంచి బయటపడిన ఆమె ఉద్యోగం మానేశారు. ఇటీవల మరోసారి అప్పులు చేసి నష్టాల్లో కూరుకుపోయింది. ఈమేరకు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఈనెల 16న ఇద్దరు పిల్లలను కోటపాడులో వదిలి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చింది.

పురుగుల మందు తాగి...
జనగామ బాలాజీనగర్‌లో ఓ భవనానికి ‘టు లెట్‌’ బోర్డ్‌ ఉండడంతో నవిత పైఅంతస్తుకు వెళ్లి రూములు ఉన్నాయా.. అని అడిగింది. అక్కడ అద్దెకు ఉన్నవారు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఉందని చెప్పగా, సూపర్‌వైజర్‌ వచ్చి వివరాలు ఆరా తీశాడు. అయితే, వెంట ఎవరూ రాలేదని అడిగితే తన సోదరుడు వస్తున్నాడని చెప్పి ఆయనను బయటకు పంపించింది. అనంతరం సమీపంలోని షాప్‌నకు వెళ్లిన ఆమె పెన్ను, పేపర్‌ తీసుకుని లేఖ రాసింది. ఆతర్వాత ఎరువుల షాప్‌నకు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తిరిగి అద్దె అడిగిన భవనంలోకి వచ్చి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

చాలాసేపు గడిచినా సవిత బయటకు రాకపోవడం, గదిలో నుంచి వాసన వస్తుండడంతో పక్కన అద్దెకు ఉంటున్న వారు చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి అప్పటికే సవిత మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నవిత తన భర్తకు ‘నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..’ అని మెసేజ్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆమె మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నా, దానిపై పురుగుల మందు పడడంతో చదవడం సాధ్యం కాలేదు. అయితే, లేఖపై ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఇచ్చిన సమాచారంతో ఆమె సోదరుడు, కుటుంబీకులు చేరుకుని ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement