గోనె సంచులు రాక.. గోదాములు లేక | Maize farmers worry in Telangana | Sakshi
Sakshi News home page

గోనె సంచులు రాక.. గోదాములు లేక

May 1 2026 3:38 AM | Updated on May 1 2026 3:38 AM

Maize farmers worry in Telangana

మక్కల కొనుగోళ్లలో గందరగోళం

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా మక్కలను విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర రూ.2,400 నిర్ణయించగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1,700 మించి రావడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఒత్తిళ్లు, రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్ల బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అయితే మార్క్‌ఫెడ్‌కు జిల్లాల్లో పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, విక్రయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌ –ప్యాక్స్‌) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల మేనేజర్లు ఇప్పుడు ప్యాక్స్‌ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయించేందుకు ప్రయతి్నస్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు.  

రికార్డు స్థాయిలో సాగు 
రాష్ట్రంలో యాసంగిలో మక్కల సాధారణ సాగు వి స్తీర్ణం 4 లక్షల ఎకరాలుగా ఉంటే ఈసారి ఏకంగా 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 43.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల ప్రైవేటు విక్రయాలు, సొంత అవసరాలు పోగా 15 లక్షల మెట్రిక్‌ టన్ను ల మక్కలను విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉత్పత్తి కావడంతో వాటిని ఎలా విక్రయించాలో తెలియని స్థితిలో మార్క్‌ఫెడ్‌ కొట్టుమిట్టాడుతోంది.  

అన్నీ సమస్యలే... 
మక్కల కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను మార్క్‌ఫెడ్‌ ముందుగానే సమకూర్చుకోవాలి. ఒకసారి వాడిన (సెకండ్‌ హ్యాండ్‌) గోనె సంచులను మక్కల కొనుగోళ్లకు వినియోగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచి, ఒక్కో గోనెసంచికి రూ.22 చొప్పున కాంట్రాక్టులు అప్పగించినా, కాంట్రాక్టర్లు సమయానికి గోనెసంచులు అందించడం లేదు. దీంతో భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, వరంగల్‌ వంటి చోట్ల రైతులే గన్నీ బ్యాగులను సమకూర్చుకొని మక్కలను విక్రయించేందుకు ప్యాక్స్‌ సెంటర్లకు వస్తున్నారు. ప్యాక్స్‌ నిర్వాహకులు కూడా గోనెసంచులతో వచ్చిన రైతుల మక్కలనే కాంటా వేస్తున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి జిల్లా మేనేజర్లు, కాంట్రాక్టర్లు, గోనెసంచులు సమకూర్చే ప్రైవేట్‌ వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చోటకు గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. 

మక్కలను సంచుల్లో నింపి, తూకం వేసి, లారీల్లో గోదాములకు తరలించేందుకు అవసరమైన హమాలీల సమస్య కూడా అన్ని జిల్లాల్లో ఎదుర్కొంటున్నారు. మరోవైపు సేకరించిన మక్కలను నిల్వ చేయడం ఇప్పుడు మార్క్‌ఫెడ్‌కు ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గోదాములన్నీ ఇప్పటికే బియ్యం, ఇతర నిల్వలతో నిండి ఉన్నాయి. తాజాగా రబీ పంట మిల్లింగ్‌కు వస్తుండడంతో కొత్త బియ్యం నిల్వలకే గోదాములు సరిపోని పరిస్థితి ఉంది. పత్తి నిల్వకు సంబంధించిన గోడౌన్‌లు ఖాళీగా ఉన్నా, ఖరీఫ్‌లో సాగయ్యే పత్తి పంట సెపె్టంబర్‌ నాటికి మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరనుంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్‌లోగా మక్కల నిల్వలను ఖాళీ చేస్తామని హామీ ఇస్తే తప్ప గోదాములు ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం.  

4 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు 
మక్కల కొనుగోళ్లకు ఇప్పటి వరకు 246 ప్యాక్స్‌ సెంటర్లను ఎంపిక చేశారు. 74వేలకు పైగా రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను సేకరించారు. నల్లగొండ, నారాయణపేట, భువనగిరి, మల్కాజిగిరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement