అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం | Mahabubabad turns tense with farmers agitation for urea | Sakshi
Sakshi News home page

అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం

Sep 5 2025 3:05 AM | Updated on Sep 5 2025 3:05 AM

Mahabubabad turns tense with farmers agitation for urea

యూరియా కోసం రైతుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారిన మహబూబాబాద్‌  

రైతులు బస్తాలు తీసుకెళుతుండగా అడ్డుకున్న పోలీసులు  

ఆగ్రోస్‌ రైతు సేవ కేంద్రం వద్ద తోపులాట... మన గ్రోమోర్‌ సెంటర్‌పై రైతుల రాళ్లదాడి 

మహబూబాబాద్‌ రూరల్‌ : ఒకచోట యూరియా కోసం కొందరు మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకోగా, మరోచోట కార్యాలయంపై రైతులు రాళ్ల దాడి చేశారు. ఆపై కట్టెలు కాల బెట్టి నిరసన తెలిపారు. దీంతో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌లోని వివేకానంద సెంటర్‌ వద్ద ఉన్న ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రంలో గురువారం యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి వందల సంఖ్యలో రైతులు అక్కడకు చేరుకున్నారు. 

రైతుల క్యూలైన్‌ భారీగా ఉండటంతో టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన రైతులు.. యూరియా పంపిణీ ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తోపులాట పెరిగి ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లి బస్తాలు తీసుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. 

ఇందులో కొందరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. దీంతో కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. మరికొంతమంది మహిళలు నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రైతు సేవాకేంద్రం నిర్వాహకులు కొంతమంది రైతులకు యూరియా బస్తాల పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

మన గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద  
యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్‌ సెంటర్‌పై రైతులు రాళ్లతో దాడిచేశారు. గ్రోమోర్‌ బోర్డును చించివేసి పాత కర్రలు వేసి నిప్పిపెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్‌ సెంటర్‌ గోదాంపై దాడిచేసి అందులోకి చొచ్చుకెళ్లారు. గోదాము తలుపులు పగులగొట్టి యూరియా బస్తాలు తీసుకొని పోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అదనపు బలగాలు వజ్ర ట్యాంకర్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోదాంలో ఉన్న యూరియా బస్తాల వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్, ఎస్పీ సు«దీర్‌ ఆర్‌ కేకన్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకున్నాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. తహసీల్దార్‌ చంద్రరాజేశ్వర్రావు రైతులను క్యూలైన్లలో నిలబెట్టి ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు.  

దొరుకుతుందో.. లేదో
అయినా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో రైతులు  
సాక్షి, నెట్‌వర్క్‌ : కనీసం ఒక బస్తా యూ రియా అయినా దొరు కుతుందో లేదో తెలి యకపోయినా తెల్లవారుజాము నుంచే రైతు లు క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. యూరియా దొరికిన రైతులు ఆనందంతో, దొరకని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల అసలు యూరియా లారీలు రావడం లేదంటూ ఆందోళనలకు దిగి రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు.  

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌ సింగిల్‌విండో సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు మణెమ్మ, కుర్మన్న స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పక్కన ఉన్న రైతులు నీళ్లు తాగించి 108లో ఆస్పత్రికి తరలించారు. టోకెన్లు తీసుకున్న రైతులే మళ్లీమళ్లీ వస్తుండడంతో మరికల్‌ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాము ఎన్నికల పోలింగ్‌ తరహాలో తీలేర్‌ సొసైటీకి వచి్చన ప్రతి రైతు చేతి బొటవేలుకు సిరా(ఇంకు) గుర్తు వేసి.. టోకెన్‌ ఇచ్చారు. వీరికి ఈ నెల 6వ తేదీన యూరియా ఇవ్వనున్నారు.  

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సింగిల్‌ విండో కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన యూరియా లారీని అధికారులు అక్కన్నపేటకు పంపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రధాన గేట్‌ రహదారిపై బైఠాయించారు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న మంత్రి కార్యాలయానికి పరుగులు పెట్టారు. పోలీసులు వారించినా రైతులు వినకుండా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు.   

తెల్లవారుజామునే కామారెడ్డి జిల్లా బీబీపేటలోని సింగిల్‌ విండో సొసైటీ కార్యాలయానికి రైతులు తరలివచ్చి క్యూలో ఉన్నారు. కొందరికే యూరియా పంపిణీ చేయడంతో రైతులు తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు, సొసైటీ సిబ్బంది సర్దిచెప్పారు.  

యూరియా అందక తన పొలం ఎర్రబడిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మానుక లక్ష్మణ్‌ ఆగ్రహంతో రగలిపోయాడు. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసిన పాపానికి చెప్పుతో కొట్టుకోవాలంటూ లక్ష్మణ్‌ తన చెప్పుతో కొట్టుకున్నాడు. యూరియా కోసం అన్నదాతలు బాధ పడుతున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిని దూషించాడు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.  

వరంగల్‌ గూడ్స్‌ షెడ్‌కు వివిధ కంపెనీలకు దాదాపు 2,912 మెట్రిక్‌ టన్నుల యూరియా వచి్చంది. దీనిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి రవీందర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement