
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ‘మన గ్రోమోర్’ దుకాణం బోర్డు చించేసిన రైతులు.. దుకాణం ముందు కర్రలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గోడౌన్ తాళం పగలగొట్టిన రైతులు.. యూరియా బస్తాలను బయటకు తెచ్చారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యూరియా ఇవ్వాలంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.

సూర్యాపేట జిల్లా: హుజుర్‌నగర్‌లో యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన మహిళ.. స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం నుంచి లైన్ లో నిలబడటంతో మహిళా రైతు దాసరి రాములమ్మ అస్వస్థతకు గురయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
