తన పేరిట పౌతి చేయడం లేదని..

Land Issue: Woman Suicide Attempt In MRO Office In Nalgonda - Sakshi

సాక్షి, డిండి(నల్లగొండ): తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని పౌతి చేయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. వివరాలు.. మండల పరిధిలోని కాల్యతండాకు చెందిన ఆంగోతు చత్రునాయక్‌కు బొగ్గులదొన గ్రామ శివారులోని 113 సర్వే నంబర్‌లో 2.28 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది.

ఇందులో నుంచి 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన దంజ్యనాయక్‌కు 28 గుంటల భూమిని విక్రయించాడు. కానీ 28 కుంటలకు సంబంధించి ప్రొసీడింగ్, పాత పట్టా పాసుపుస్తకం జారీ అయినప్పటికీ ధరణిలో మాత్రం వివరాలు నమోదు కాలేదు. చత్రునాయక్‌ మరణించడంతో ప్రస్తుతం అతడి కుమారులు తన తండ్రి పేరు మీద ఉన్న 2.28 ఎకరాలు పౌతి చేయాలని స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న దంజ్యానాయక్‌ గతంలో తనకు విక్రయించిన 28 గుంటల భూమి తనకే చెందుతుందని, అందుకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని, సదరు పౌతిని నిలిపివేయాలని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉంచినట్లు తహసీల్దార్‌ ప్రశాంత్‌ తెలిపారు.

కాగా తన తండ్రి పేరు మీదన్న పొలాన్ని పౌతి చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చత్రునాయక్‌ కుమారులలో ఒకరైన భద్యానాయక్‌ పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పోచయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top