
కుబేర సినిమా పైరసీ నిందితుల అరెస్టు
అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు గుర్తింపు
త్వరలోనే అధికారికంగా వివరాల వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: నాగార్జున, ధనుష్ ప్రధాన తారాగణంగా నటించిన కుబేర సినిమా విడుదల అయిన రోజే పైరసీ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. సినిమా «థియేటర్‌లో ఈ చిత్రాన్ని రికార్డు చేసిన యువకుడితో పాటు సహకరించిన వారినీ అరెస్టు చేశారు. ఈ పైరసీ వెనుక అంతర్జాతీయ ముఠా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబం«ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. జూన్ 20న కుబేర చిత్రం విడుదలైన కొన్ని గంటలకే దీని హెచ్‌డీ ప్రింట్ 1తమిళ్‌బ్లాస్టర్స్, 1తమిళ్‌ఎంవీ వెబ్‌సైట్లలోకి చేరింది. దీనిని తీవ్రంగా పరిగణించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది.
దీని అంతర్భాగమైన యాంటీ వీడియో పైరసీ సెల్ ఆయా వెబ్‌సైట్లలో ఉన్న సినిమాను అధ్యయనం చేసింది. గతంలో రీళ్ల ఆధారంగా సినిమాలు ప్రదర్శితం అయ్యేవి. అయితే ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్‌లో శాటిలైట్ లింకేజ్ ద్వారానే థియేటర్లలో స్క్రీన్ల పైకి వస్తున్నాయి. పైరసీని నిరోధించడానికి, దాని మూలాలను కనిపెట్టడానికి ఆయా సినిమాలకు ఓ వాటర్ మార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి థియేటర్‌లో, ప్రతి షోలో ప్రదర్శితమయ్యే సినిమాకు ఇది మారిపోతూ ఉంటుంది. సినిమా ప్రదర్శితం అయ్యేప్పుడు అకస్మాత్తుగా ఇది తెరపైకి వచ్చి వెళుతుంటుంది. దీన్ని సాధారణ ప్రేక్షకులు గుర్తించలేకపోయినా... ఎవరైనా ఆ సినిమాను రికార్డు చేస్తే ఇది కూడా రికార్డు అవుతుంది. పైరసీ వెబ్‌సైట్లలో ఉన్న సినిమాను అధ్యయనం చేసే యాంటీ వీడియో పైరసీ సెల్ ఆ వాటర్‌మార్క్ ద్వారా సదరు చిత్రాన్ని ఏ థియేటర్‌లో, ఏ షోలో రికార్డు చేశారో గుర్తిస్తుంది.
కుబేర చిత్రాన్ని సినిమా విడుదలైన రోజే పీవీఆర్ సెంట్రల్ థియేటర్‌లోని స్క్రీన్–5లో రికార్డు చేసినట్లు తేలి్చంది. ఈ ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ సబావత్ నరేష్ దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ రోజు ఆ థియేటర్, ఆ స్క్రీన్ వద్ద, హాలు లోపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సంగ్రహించి అధ్యయనం చేశారు. ఈ రికార్డింగ్స్‌ను జేబులో ఇమిడిపోయే హెచ్‌డీ కెమెరాలతో చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కుబేర చిత్రం రికార్డు అయిన తీరు ఆధారంగా ఏ సీటులో కూర్చుని రికార్డు చేశారనేది గుర్తించారు. ఆ ప్రాంతంలో సీట్లకు టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఇతడికి సహకరించిన వ్యక్తినీ కటకటాల్లోకి పంపారు. వీరికి అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు గుర్తించారు. విదేశాల్లో ఉన్న ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ సినిమా వీడియోను పంపగా... ప్రతిఫలంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు పొందినట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రిప్టో కరెన్సీని నిందితులు జెబ్ పే, కాయిన్ డీసీఎక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లు గుర్తించారు. కొన్ని పేమెంట్ గేట్‌వేస్‌లో గేమింగ్‌లకు సంబంధించిన లింకులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.