
తొలిపూజకు సిద్ధమైన ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పూజలు ప్రారంభం
ఖైరతాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్దమయ్యాడు. బుధవారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాగణపతి ఇరువైపులా 12 అడుగుల ఎత్తులో కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు, మహాగణపతి పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూరిజగన్నాథ స్వామి, లక్ష్మి సమేత హరిగ్రీవ స్వామి విగ్రహాలు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు మహాగణపతికి 75 అడుగుల జంధ్యం, చేనేత నూలు కండువా, గరిక మాలను సమరి్పస్తారు. మహాగణపతి ఇరువైపులా కొలువు దీరిన కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు.
మూడు ముఖాలు – పంచముఖ నాగేంద్రుడి నీడలో మహాగణపతి..
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసి రెండు నెలల పాటు 150 మంది కళాకారులతో కలిసి మహాగణపతి ప్రతి రూపాన్ని తీర్చి దిద్దామని, మూడు ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడి ఉన్న ఆకారంలో మట్టితో రూపొందిన మహాగణపతిని ఆద్యంతం అద్భుతంగా తీర్చిదిద్దామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.
600 మంది పోలీసులతో భారీ బందోబస్తు
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ప్రతి రోజు 1.5 లక్షల నుంచి వారాంతాలు, సెలవు రోజుల్లో 5–6 లక్షల మంది తరలి వచ్చే అవకాశముండటంతో పోలీసులు బారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు మెట్రో రైల్వేస్టేషన్ నుంచి ఖైరతాబాద్ రైల్వే గేటు మీదుగా, రాజ్ దూత్ చౌరస్తా నుంచి, మింట్ కాంపౌండ్ వైపు నుంచి వచ్చే భక్తులకు ఆయా మార్గాల గుండా దర్శనం కోసం క్యూ లైన్‌లలో వచ్చి దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆరుగురు డీఎస్పీలు,, 23 మంది సీఐలు, 52 మంది ఎస్‌ఐలు, 50 మంది మహిళా పోలీసులు, 22 ప్లాటూన్లు, బాంబ్, డాగ్ స్వా్క, షీటీంలతో కలుపుకొని మొత్తంగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ వివరించారు.
మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు
- ప్రతి రోజు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది
- సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా మార్గాల్లోనే దర్శనానికి రావాలి
- స్వంత వాహనాల్లో వస్తే పార్కింగ్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.
- అన్ని మార్గాల్లో 5 అంబులెన్స్‌లు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాం
- 60 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
- అన్ని మార్గాల్లో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు
- అదనంగా కమిటీ తరఫున 100 మంది ప్రైవేటు సెక్యురిటీ నియామకం
- వయస్సు పైబడిన వారు, చిన్న పిల్లలతో వచ్చే వారు డే టైంలో దర్శించుకోవాలి
- విలువైన వస్తువులు, ఆభరణాలు ధరించవద్దు