‘రీయింబర్స్‌మెంట్‌’లో కీలక మార్పు | Key changes in Fee reimbursement Scheme In Telangana | Sakshi
Sakshi News home page

‘రీయింబర్స్‌మెంట్‌’లో కీలక మార్పు

May 1 2026 1:18 AM | Updated on May 1 2026 1:18 AM

Key changes in Fee reimbursement Scheme In Telangana

ఇప్పటివరకు కాలేజీల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న ప్రభుత్వం  

ఇకపై అర్హులైన విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు మొత్తం చెల్లింపు 

తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును కాలేజీలకు విద్యార్థులు చెల్లించేలా నిబంధన 

ఆధార్‌ ఆధారిత హాజరు వ్యవస్థ తప్పనిసరిగా అమలు 

మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం 

పేదలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌(ఏపీబీఎస్‌) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ ఉత్తర్వులు (జీఓఎంఎస్‌ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

పేద విద్యార్థులకు వైఎస్‌ భరోసా.. 
పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు.  

విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం 
కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ నిలిచిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్‌ అధికారి 
– విద్యార్థుల ప్రోగ్రెస్‌ ట్రాకింగ్‌ కోసం ఈపాస్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ రూపొందించాలి. 
– స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలి. 
– ఆధార్‌ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. 
– ఆన్‌లైన్‌ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్‌ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్‌గా అప్‌లోడ్‌ చేయాలి. 
బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. 
– జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్‌ వెరిఫికేషన్‌ తర్వాత స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తారు. 
– డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్‌ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్‌ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. 
– ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్‌ పొందిన వారికి వర్తిస్తాయి. 
– 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. 
– సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్‌ఎంఐఎస్, పీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. 

ఫీజుల చెల్లింపుపై అస్పష్టత 
⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఆటోమేటిక్‌ రెన్యువల్‌.. 
⇒ ఆధార్‌ లింక్‌ చేసిన విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏ పీబీఎస్‌ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. 
⇒ దరఖాస్తు సమయంలో ఆధార్‌ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. 
⇒ ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేస్టేషన్‌  కోసం బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్‌ లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా మాత్రమే సమర్పించాలి. 
⇒ బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎన్‌పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. 
⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్‌తో లింక్‌ చేయాలి. 
⇒ రెన్యువల్‌ అప్లికేషన్లు ఆటోమేటిక్‌గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి.  

Advertisement
 
Advertisement
Advertisement