
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చొరవకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా కేతిరెడ్డి ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. తన చొరవతో సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలలో ముగింపు పలకలని అధికారులను ఆదేశించి, తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ఎవ్వరు చెడగొట్టాలని ప్రయత్నించినా సహించేది లేదన్న సంకేతం ఇచ్చారు. హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ సినిమా హబ్ చేయాలన్న తన కోరికకు ఈ సమ్మె ఒక అడ్డంకిగా ఉందని ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తదితరులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు.
అదేవిధంగా ఎన్నో రోజులుగా సతమతమవుతున్న సినీ కార్మికుల సమస్యలు, చిత్రపురి కాలనీ వ్యవహారంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమాలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్టర్ వద్ద లెక్కలు సమర్పించకుండా ఉన్న వారిపై, దొంగ సభ్యులను చేర్చుకొని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాటిని సొసైటీస్ రిజిస్టర్ వద్ద సమర్పించని ట్రేడ్ యూనియన్ సంఘాలపై విచారణ చేపట్టాలన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.