సెకండ్‌ వేవ్‌ రావొచ్చు.. బీ అలర్ట్‌

KCR Review Meeting Of Alert On Corona Second Wave In Telangana - Sakshi

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా..

తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలి 

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి 

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే..

10 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ సిద్ధం 

కరోనాపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ ఆదేశించారు. ప్రజలు కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు. ‘ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి’అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అని సూచించారు.

‘రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణలో కోవిడ్‌ కేసుల సంఖ్య బాగా తగ్గింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.1 శాతం మాత్రమే ఉంది. రికవరీ రేటు 94.03 శాతం ఉంటున్నది. కోవిడ్‌ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా పదివేల బెడ్స్‌ ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది’అని సీఎం స్పష్టం చేశారు. 

ప్రజల సహకారం అవసరం 
‘కోవిడ్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందు. తప్పకుండా మాస్క్‌ ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి’అని సీఎం సూచించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, మెడికల్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి, కోవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top