
బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌తో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి
‘తెలంగాణ జాగృతి’ సంస్థకే రాజకీయ పార్టీ రూపం
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వారిని కలుపుకొని వెళ్లే యోచన
నేడు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా పార్టీ కీలక నేతలు లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీఆర్‌ఎస్ నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఆమె దృష్టి సారించారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో సంస్థాగత అంశాలు, పార్టీ కీలక నేతలు లక్ష్యంగా విమర్శలు చేస్తుండగా.. ఇకపై బహుముఖ వ్యూహాన్ని అనుసరించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్ సహా ఏ ఇతర పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం తాను అ«ధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థకు రాజకీయ పార్టీ రూపం ఇవ్వడం ద్వారా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త పార్టీ కార్యాచరణ ఉండే అవకాశముంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు, సంస్థలతో పాటు కలిసి వచ్చే వారిని కలుపుకొని రాజకీయంగా అడుగులు ముందుకు వేయడంపై కవిత కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సమయంలో తన తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రీతిలోనే.. కవిత కూడా బీఆర్‌ఎస్ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని వదులుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనిపై తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
సాంస్కృతిక ఉద్యమానికి పదును
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆత్మ గౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక ఉద్యమానికి పదును పెట్టాలని కవిత భావిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణతో పాటు 20కి పైగా దేశాల్లో సంబురాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగు తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు లు, సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలిసింది.
జాగృతి కార్యాలయం వద్ద నిరసన
కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌రావు దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నినాదాలు చేశారు. మరోవైపు కవిత మంగళవారం జాగృతి నేతలతో భేటీ అయ్యారు.