కామారెడ్డి ‘మాస్టర్‌ప్లాన్‌’ వెనక్కి!

Kamareddy Municipal Come Forward To Cancel Master Plan - Sakshi

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌: ‘భూమిని మింగే మాస్టర్‌ ప్లాన్‌ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్‌ పాలకవర్గం మాస్టర్‌ప్లాన్‌ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్‌లైన్‌ విధించింది.

ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్‌ కమషనర్‌కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top