కరోనాకు ఎవరూ అతీతం కాదు.. సహకరించండి

K Taraka Rama Rao Visits Sircilla Start Ambulance - Sakshi

సిరిసిల్లలో కేటీఆర్‌ సుడిగాలి పర్యటన

కోవిడ్‌ వార్డు, ఐదు అంబులెన్స్‌లు ప్రారంభం

సిరిసిల్లా జిల్లా ఆస్పత్రికి రూ. 2.28 కోట్లు

జిల్లా పారిశుద్ధ కార్మికులకు వేతనాల పెంపు

సాక్షి, కరీంనగర్‌, సిరిసిల్లా: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి‌ ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.‌ తాను సైతం ప్లాస్మా డోనేషన్ చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్, సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వార్డును, ఐదు ప్రత్యేక అంబులెన్స్‌లను ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈఈ భవనాలకు శంఖుస్థాపన చేశారు.‌ అనంతరం సర్దాపూర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఐసోలేషన్ వార్డును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టులు పెంచుతామని.. పాజిటివ్ వస్తే భయాందోళనకు గురై ఆగమాగం కావద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇది 100 శాతం ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రజల్లో తిరగాలని.. జనాలకు అవగాహన కల్పించే బాధ్యత తమపైనే ఉందన్నారు. కొందరు చిల్లరమల్లరగా మాట్లాడుతూ రాజకీయం చేయడం మంచిది కాదని కేటీఆర్‌ హితవు పలికారు. (ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై కేటీఆర్‌ ఫైర్‌)

కరోనాకు ఎవరూ అతీతం కాదు
కష్టకాలంలో కరోనా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనే దాని గురించి ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 2 కోట్ల 28 లక్షల రూపాయలు సీఎస్‌ఆర్‌ నిధుల రూపంలో హాస్పిటల్‌కు రేపు అందిస్తామని తెలిపారు. తన వంతుగా 20 లక్షల రూపాయలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోజుకు వెయ్యి పరీక్షలు పెంచాలని వైద్యాధికారులుకు సూచించానన్నారు. 32 పడకలతో అగ్రి కల్చర్ కళాశాలలో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మండేపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా వియోగిస్తామని తెలిపారు.‌ కరోనా వస్తే ప్రజలంతా సహకరించాలి, వారిని వేలేసినట్లు చూడొద్దని కోరారు. అమిత్ షా, కర్ణాటక, మధ్య ప్రదేశ్ సీఎంలకు కూడా పాజిటివ్‌ వచ్చింది.. కరోనాకు ఎవరూ అతీతం కాదన్నారు. వెంటిలేటర్లు అవసరాన్ని బట్టి పెంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచుతామని.. అయితే ఈ నిర్ణయం కేవలం జిల్లా వరకు మాత్రమే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. (వ్యాక్సిన్‌ వచ్చే వరకు అదొక్కటే మార్గం)

లాక్‌డౌన్‌ వల్ల సమస్య పరిష్కారం కాదు
ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా తీసుకుంటామన్నారు కేటీఆర్‌.‌ హోమ్ మినిష్టర్ మహమ్మద్ అలీ, పెద్దలు హనుమంతరావు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు కరోనా వస్తుందని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందన్నారు.‌ కరోనా కట్టడికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని, అనవసర విమర్శలకు పోవద్దని కోరారు. మీడియాలో లోటు పాట్లు చూపాలని.. పాజిటివ్ కథనాలను హై లెట్ చేయాలని కోరారు. ప్రతిపక్షాల సహకరించాలని కోరారు. కరోనా వైరస్‌కు చికిత్స లేదు...నివారణ ఒక్కటే మార్గమన్నారు. లాక్ డౌన్ వల్ల సమస్య పరిష్కారం కాదని కేటీఆర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top