రేవంత్‌రెడ్డి, కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు ప్రతిష్టాత్మకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే ప్రధాన ధ్యేయం
వ్యూహ రచనలో మూడు ప్రధాన పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్‌గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్‌టెస్ట్‌గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో కీలకం
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్‌రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్‌మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్‌బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్‌గా మారనుంది.
కేటీఆర్‌కు సరై్వవల్ టెస్ట్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్‌కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్‌పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్‌స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్‌గా కేటీఆర్ నిలుస్తారు.
కిషన్‌రెడ్డికి అవశ్యం..
బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్‌కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్‌రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది.


