
ఇరానీ సమోసా రూ. 3
చికెన్ భోజనం రూ. 125
ఇవి సబ్సిడీ ధరలు కాదు
అన్నపూర్ణ క్యాంటీన్లలో అంతకన్నా కాదు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అభ్యర్థులు ఎన్నికల వ్యయం లెక్కల్లో చూపాల్సిన ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు చేసే ఖర్చు రూ.కోట్లలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నిబంధనల మేరకు మాత్రం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 40 లక్షలు మించరాదు. అభ్యర్థులు తాము ఎంతమొత్తంలో ఖర్చు చేసినా లెక్క మాత్రం అంతకు లోబడే ఉండాలి. అందుకుగాను అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలకు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికి , ప్రజలను ఆకట్టుకునేందుకు చాటుమాటుగా పంచే నగదు, కానుకలకు ఎలాగూ లెక్కలుండవు. కానీ.. ప్రచారంలో పాల్గొనే వారికి ఇచ్చే టీ, కాఫీలు, భోజనాలు, ప్రచారంలో వినియోగించేందుకు కొనుగోలు చేసే, అద్దెకు తీసుకునే వస్తువులు, సరుకులు మాత్రం దాచలేరు.
వ్యయపరిమితి మించకుండా ఉండేందుకు అభ్యర్థులు ఎలాగూ తక్కువ ఖర్చు చూపిస్తారు కాబట్టి, కనీసం టీ, కాఫీల వంటివాటికైనా వారు ఎక్కువ తిప్పలు పడి ఖర్చులు దాచనవసరం లేకుండా తక్కువ వ్యయాన్నే ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. అన్నింటి ధరలు కాదు గానీ కొన్నింటికి మాత్రం ఏడేళ్ల నాటి ధరలే ఇంకా ఉండటం విశేషం. అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి గతంలో రూ. 28 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.40 లక్షలకు పెంచారు. అయినప్పటికీ కొన్నింటి ధరలు మాత్రం అలాగే ఖరారు చేయడం విచిత్రం. అంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ.. తక్కువగా చూపించేందుకు అవకాశం ఇచ్చారన్న మాట!
2018 నాటి ధరలే..
గ్రేటర్ నగరంలో ఎక్కడైనా రూ.5కే కప్పు టీ దొరుకుతుందా? ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే ధరల పట్టికలో మాత్రం టీ (చిన్నకప్పు) ధర రూ. 5గానే ఖరారు చేశారు. కాఫీ చిన్న కప్పు ధర రూ.6గా ఖరారు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం ఇవే ధరలున్నాయి. నగరంలో రోడ్డు పక్క చాయ్‌వాలా వద్ద కూడా ఇంత తక్కువ ధర ఉండదు. 200 మి.లీ. వాటర్ బాటిల్ ధర 2018లో, 2023లో, ఇప్పుడు కూడా రూ.6గానే చూపారు. నాలుగు ఇడ్లీల ధరలు, రెండు వడల ధరలు సైతం అప్పుడు, ఇప్పుడు రూ.20గానే ఉన్నాయి.
ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులకు ఆహార పదార్థాలు అందజేయాల్సి ఉంటుంది కాబట్టి వాటివల్లే ఎక్కువ వ్యయం కాకుండా ఉండేందుకు వీటి ధరలు పెంచలేదేమో ? ఆహార పదార్థాలతోపాటు కొనుగోలు చేసే ఆయా ఐటమ్‌లలోనూ, అద్దెలకు తీసుకునే సామాన్లు, వాహనాలు, టెంట్లు , తదితరమైన వాటిల్లోనూ పాత ధరలకు, ప్రస్తుత ధరలకు కొన్నింట్లో తేడాలున్నా, కొన్ని అలాగే ఉన్నాయి. చిన్న క్లాత్ బ్యానర్ గతంలో రూ.30 మాత్రమే ఉండగా, వాస్తవ ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.140 ఖరారు చేశారు. అలాగే.. పెద్ద బ్యానర్ గతంలో రూ. 55– 71 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180కి పెరిగింది.
ప్రస్తుత ధరలు
ప్రస్తుతం కండువా రూ. 25, పులిహోర రూ.40, చికెన్ బిర్యానీ రూ.170, ఫొటో గ్రాఫర్‌కు రోజుకు రూ.1500, వీడియోగ్రాఫర్‌కు రూ.1800, చిన్న పూల దండ రూ.100, పెద్ద పూలదండ రూ.250, ఆరు సీట్ల వరకు మోటార్ క్యాబ్ అద్దె రోజుకు రూ.1430గా ఉన్నాయి. మొత్తం 80 రకాల వస్తువులు, సామగ్రి, ఆహార పదార్థాలకు హాళ్లు, వాహనాల అద్దెలకు రేట్లు ఖరారు చేశారు. జాబితాలో లేని వాటికి అభ్యర్థులు సమరి్పంచే ఓచర్లను సంబంధిత అధికారులు çపరిశీలిస్తారు.