గులాబీ ఫ్లెక్సీల్లో జీవన్‌రెడ్డి ఫొటో | Jeevan Reddy Green Signal For BRS Details Inside | Sakshi
Sakshi News home page

గులాబీ ఫ్లెక్సీల్లో జీవన్‌రెడ్డి ఫొటో

Apr 9 2026 12:32 PM | Updated on Apr 9 2026 1:00 PM

Jeevan Reddy Green Signal For BRS Details Inside

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా జగిత్యాల వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 

గురువారం ఉదయం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కలిసిన కేటీఆర్‌, వినోద్‌ కుమార్‌, రమణ.. ఇతర కీలక నేతలు సుమారు అరగంట పాటు జీవన్‌రెడ్డి చేరిక అంశంపై చర్చించారు. అనంతరం జగిత్యాలకు బయల్దేరారు. 

కేటీఆర్‌ రాకతో జగిత్యాల అంతటా బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే కేటీఆర్‌తో పాటు జీవన్‌రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో ప్రముఖంగా కనిపిస్తోంది. దీంతో.. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారైందనే సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే పార్టీ ప్లీనరీ కంటే ముందే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరవచ్చని తెలుస్తోంది.

జీవన్‌రెడ్డి తెలంగాణలో సీనియర్‌ రాజకీయ నేత. 1983లో కాంగ్రెస్‌ చేరి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. గతంలో రెండుసార్లు మంత్రి పని చేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో హర్టయ్యారు. ఈ క్రమంలోనే 43 ఏళ్ల కాంగ్రెస్‌ బంధాన్ని తెంచుకున్నారు. 

బీఆర్‌ఎస్‌దే విజయం
బీఆర్‌ఎస్‌లో చేరిక వేళ.. జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దేనని అన్నారు. కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే బీఆర్‌ఎస్‌ పాలన భేష్‌ అని.. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. 

అది చెప్పడానికి జీవన్‌రెడ్డి ఎవరు?
జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ 14సార్లు బీఫామ్‌ ఇచ్చింది. రేవంత్‌ పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్‌రెడ్డి ఎవరు?. కేసీఆర్‌ అవినీతిని జీవన్‌రెడ్డి చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రండి. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని మహేష్‌గౌడ్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement