భవన నిర్మాణ అనుమతులు చిటికెలో..

Instant Approval For Building Construction In TS-BPASS System - Sakshi

టీఎస్‌ బీపాస్‌ భవన అనుమతుల్లో సత్ఫలితాలు

నిర్దేశిత గడువుల్లోగా 85 శాతం అనుమతులు

70 శాతం దరఖాస్తులు ఇన్‌స్టంట్‌ అనుమతుల కేటగిరీవే

8,498 దరఖాస్తుల్లో 4,903 దరఖాస్తుల పరిశీలన పూర్తి

పరిశీలనలో మరో 3,241 దరఖాస్తులు..

గడువు తీరినా అనుమతి రాని 15 శాతం దరఖాస్తులు

భారీగా పెరుగుతున్న ‘భవన నిర్మాణ’ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: భవనాలు, లేఔట్ల అనుమతుల్లో విప్లవాత్మక సంస్క రణలు ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌–బీపాస్‌) సత్ఫలితాలి స్తోంది. అత్యంత పారదర్శకంగా, తక్షణ అనుమతులు/ నిర్దేశిత గడువు లోగా అనుమతుల కోసం గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌– బీపాస్‌ చట్టం తీసుకొచ్చింది. నవంబర్‌ నుంచి టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ (https://tsbpass.telangana.gov.in) ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. 85 శాతానికి పైగా దరఖాస్తులకు ఈ విధానం ద్వారా నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు లభించాయి. ఇప్పటివరకు మొత్తం 8,498 దరఖాస్తులు రాగా, అందులో 4,903 (58 శాతం) దరఖాస్తుల పరి శీలన పూర్తయింది. ఫీజుల రూపంలో రూ.44.08 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల్లో లోపాలు, ఫీజు బకాయిల కారణాలతో 354 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన దశలో 3,241 (38 శాతం) దరఖాస్తులుండగా, వీటిలో 1,956 దరఖాస్తుల గడువు ఇంకా ముగియలేదు. మిగిలిన 1,285 (15 శాతం) దరఖాస్తుల గడువు ముగిసిపోయింది. సింగిల్‌ విండో కేటగిరీలో పరిశీలనలో ఉన్న 54 దరఖాస్తుల్లో రెండు దరఖాస్తుల గడువు తీరింది. తక్షణ అనుమతుల కేటగిరీలో 2,457 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 1,000 దరఖాస్తుల గడువు ముగిసింది. తక్షణ రిజిస్ట్రేషన్‌ కేటగిరీలో 730 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 283 దరఖాస్తుల గడువు మీరింది.

గణనీయంగా పెరిగిన దరఖాస్తులు..
టీఎస్‌–బీపాస్‌ విధానంపై దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నవంబర్‌లో 1,131 దరఖాస్తులు రాగా, డిసెంబర్‌లో 1,978కు, జనవరిలో 3,671కు పెరిగాయి. అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తుండటం, లంచాల కోసం వేధింపులు తగ్గడంతో అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టే వారి సంఖ్య పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

70 శాతం ‘ఇన్‌స్టంట్‌’
టీఎస్‌–బీపాస్‌ దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ఈ విధానం అమల్లోకి రావడంతో 75 చదరపు గజాల స్థలంలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్న ఇళ్లకు బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతి అవసరం లేదు. ఆస్తి పన్నులు మదించేందుకు రూ.1 చెల్లించి టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌లో ‘తక్షణ రిజిస్ట్రేషన్‌’చేసుకుంటే సరిపోతుంది. 76 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల లోపు ఎత్తులో నిర్మించనున్న నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో ‘తక్షణ అనుమతులు’ఇవ్వనున్నారు. 500 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో, 10 మీటర్లకుపైగా ఎత్తులో నిర్మించనున్న నివాస, నివాసేతర భవనాలకు ‘సింగిల్‌ విండో’విధానంలో 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ కావాలి. లేదంటే అనుమతి లభించినట్లేనని భావించి నిర్మాణం ప్రారంభించొచ్చు. అయితే రూ.1 చెల్లించి తక్షణ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి అధిక దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. దీనికి విరుద్ధంగా భవన నిర్మాణ ఫీజులు పూర్తిగా చెల్లించి ‘తక్షణ అనుమతుల’కోసం వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉండటం టీఎస్‌–బీపాస్‌కు లభిస్తున్న విశేష స్పందనను తెలియజేస్తోంది.

టాప్‌లో జీహెచ్‌ఎంసీ 
టీఎస్‌–బీపాస్‌ దరఖాస్తుల పరిశీలనలో జీహెచ్‌ఎంసీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్‌ఎంసీ 69 శాతం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానింగ్‌ (డీటీసీపీ) 60 శాతం, హెచ్‌ఎండీఏ 53 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. వివిధ కేటగిరీల దరఖాస్తుల పరిశీలనలో ఆయా శాఖలు/విభాగాలు సాధించిన పురోగతిని ఈ కింది పట్టికలో చూడవచ్చు.

అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే..
అత్యధిక సంఖ్యలో టీఎస్‌–బీపాస్‌ దరఖాస్తులొచ్చిన టాప్‌–5 జిల్లాలుగా మేడ్చల్‌(1803), రంగారెడ్డి(1332), మహబూబ్‌నగర్‌(582), సంగారెడ్డి(497), కామారెడ్డి(434) నిలిచాయి. జీహెచ్‌ఎంసీ, మహబూబ్‌నగర్, బడంగ్‌పేట, దుండిగల్, కామారెడ్డి దరఖాస్తుల సంఖ్యలో టాప్‌–5 పురపాలికలుగా ఉన్నాయి. 

ఎల్టీపీ రూ.9 వేలు తీసుకున్నడు: వెంకటనర్సయ్య, మహబూబ్‌నగర్‌
150 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా, 15 రోజుల్లోగా అనుమతి ఇచ్చారు. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన మేరకు రూ.63 వేల ఫీజు చెల్లించాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి లైసెన్డ్‌ టెక్నికల్‌ పర్సన్‌(ఎల్టీపీ) రూ.9 వేలు అడిగితే ఇచ్చేశాం. అధికారులెవరూ లంచాలు అడగలేదు.

21 రోజులు ఆగమన్నారు: అడప కృష్ణ, మధురానగర్‌ కాలనీ, ఖమ్మం
113 చదరపు గజాల స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణం కోసం జనవరి 1న దరఖాస్తు చేసుకుని, అప్పుడే నిర్దేశించిన మేరకు ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్, బిల్డింగ్‌ పర్మిషన్‌ ఫీజుల కింద రూ.56 వేలు చెల్లించాను. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ప్రాథమిక అనుమతులు ఇచ్చారు. అయితే వెంటనే పనులు ప్రారంభించొద్దని, 21 రోజులు ఆగాలని చెప్పారు. 21 రోజుల్లోగా తుది అనుమతుల సర్టిఫికెట్‌ ఇచ్చి మరో రూ.15 వేలు ఫీజు చెల్లించాలని అడిగి తీసుకున్నారు. తక్షణ అనుమతుల విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు సరైన అవగాహన లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top