సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు! | Indiramma Houses granted to 12,000 people against rules | Sakshi
Sakshi News home page

సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!

Jul 7 2025 2:58 AM | Updated on Jul 7 2025 2:58 AM

Indiramma Houses granted to 12,000 people against rules

తొలి విడత అర్హుల జాబితాలో మూడో విడత అర్హుల పేర్లు

వీరికి ఇప్పటికిప్పుడు ఇళ్లు అవసరం లేదని తేల్చిన సర్కారు 

12 వేల మందికి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మంజూరు 

బిల్లులు చెల్లించే సమయంలో గుర్తించిన సాఫ్ట్‌వేర్‌.. ఆ 12 వేల మంది అర్హతలపై రీసర్వేకు ఏర్పాట్లు 

వారు కూడా అర్హులేనని సర్దుబాటు చేసే ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తక్షణం ఇల్లు అవసరం ఉన్నవాళ్లను పక్కనబెట్టి.. వారికంటే మెరుగైన స్థితిలో ఉన్నవాళ్లకు ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటికిప్పుడు వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రభుత్వమే గుర్తించి వారి దరఖాస్తులు పక్కన పెట్టినా.. అధికారులు మాత్రం అలాంటి దాదాపు 12 వేల మందికి ఇళ్లు మంజూరు చేశారు. 

బిల్లులు చెల్లించే సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లకోసం అందిన దరఖాస్తులను ప్రభుత్వం ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 అని మూడు విభాగాలు చేసింది. ఇందులో ఎల్‌3 జాబితాలోని దరఖాస్తుదారులు ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులు కాదని తేల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా ఎల్‌3 జాబితాలోని దాదాపు 12 వేల మంది ఇంటి మంజూరీ పత్రాలు పుచ్చుకుని ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టేశారు.  

స్పష్టమైన విభజన.. 
ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన విధివిధానాలకు తగ్గట్టుగానే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అర్హతలో ఏమాత్రం అనుమానమున్నా వాటిని పక్కన పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. 

వచ్చిన దరఖాస్తుల్లో అతి పేదలు, నిరుపేద వికలాంగులు, ఆదుకునే వారు లేని పేద వితంతువులు వంటివారికి వెంటనే ఇల్లు పొందే అర్హత ఉందని తేల్చి వారిని ఎల్‌1 జాబితాలో చేర్చింది. సొంత జాగా ఉన్నవారికే ఈసారి ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినందున దాన్ని తొలి అర్హతగా తేల్చింది. ఇక నిరుపేదలే అయినప్పటికీ సొంత జాగా లేని వారికి తదుపరి విడతల్లో ఇళ్లు కేటాయించవచ్చని నిర్ణయించి వారి దరఖాస్తులను ఎల్‌2 జాబితాలో చేర్చింది. 

గతంలో ఇలాంటి ఇంటి పథకంలో కొంత లబ్ధి పొంది (బేస్‌మెంట్‌ వరకు నిధులు పొందినవారు), అద్దె ఆర్‌సీసీ పైకప్పు ఇంటిలో ఉంటున్నవారు, పేదలే అయినా కొంత మెరుగ్గా ఉన్నవారి దరఖాస్తులను ఎల్‌3లో చేర్చారు. వీరికి తొలి విడతలో ఎట్టి పరిస్థితిలో ఇల్లు ఇవ్వటానికి వీలు లేదని నిర్ణయించారు.  

తప్పు గుర్తించిన టెక్నాలజీ 
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, ఇందులో 1.48 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా దశల ఆధారంగా ఇళ్లకు ఆర్థిక సాయం పంపిణీ జరుగుతోంది. ఇటీవల అలా పంపిణీ జరుగుతున్న సమయంలో ఎల్‌3 జాబితాలోని వారు కూడా ఉన్నట్టు గృహనిర్మాణ శాఖ కేంద్ర కార్యాలయంలోని సాంకేతిక వ్యవస్థ గుర్తించింది. 

వెంటనే ఎక్కడో పొరపాటు జరిగిందని అధికారులు ఆరా తీయగా, 12 వేల మంది ఎల్‌3 జాబితాలోనివారు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టినట్లు తేలింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే నిధుల విడుదలపై ప్రభావం పడుతుందేమోనని అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. దీంతో విషయాన్ని గృహనిర్మాణ శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌3 జాబితాలోని వారికి ఆర్థిక సాయం పంపిణీ నిలిపేసి, వారి అర్హతలపై రీసర్వే చేయాలని నిర్ణయించారు.  

ఎలా జరిగింది? 
జిల్లాల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే. ఇళ్ల మంజూరీకి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి తేల్చాల్సి ఉంటుంది. అర్హులను తేల్చేందుకు అప్పట్లో వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం తతంగంలో స్థానిక ఎమ్మెల్యేది కీలక పాత్ర. ఎల్‌1 జాబితాలోని వారికే ఇళ్లను మంజూరు చేయాల్సి ఉన్నా.. కొందరు నేతలు ఎల్‌3లోని వారు కూడా అర్హులే అంటూ వారి పేర్లను సిఫారసు చేశారు. గ్రామ సభలు వాటికి ఆమోదం తెలిపాయి. 

వారికి అలా ఇళ్లు మంజూరయ్యాయి. ఎల్‌3 లోని వారి వివరాలు కూడా గృహనిర్మాణ శాఖకు సంబంధించిన ప్రత్యేక యాప్‌లో ఆధార్‌ కార్డు నంబర్, రేషన్‌కార్డుతో అనుసంధానించి నిక్షిప్తం చేశారు. ఈ జాబితాలోని దరఖాస్తుదారులకు బిల్లులు మంజూరు చేస్తే, ఆ యాప్‌లో రెడ్‌ మార్క్‌ కనిపిస్తుంది. అలా కుప్పలు తెప్పలుగా రెడ్‌ మార్కులు కనిపించటంతో ఏ1 జాబితాలోకి వారు ఎలా వచ్చారు? దీని వెనక ఏం జరిగిందన్న కోణంలో అంతర్గతంగా విచారణ చేపట్టారు. 

అర్హులుగా మార్చే ప్రయత్నం.. 
ఎల్‌3లోని వారికి ఇళ్లు మంజూరు అయ్యాయంటే.. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాయన్న అపవాదు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో వారు కూడా నిరుపేదలే కాబట్టి.. తొలివిడత సర్వేలో సిబ్బంది సరిగా చూడకుండా వారిని ఎల్‌3లో చేర్చారన్న కోణంలో ఇప్పుడు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో సింహభాగం మంది అర్హులే అని తేల్చి వారికి యధాప్రకారం బిల్లులు మంజూరు చేస్తారని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement